బీఆర్ఎస్ ఓడితే కల్వకుంట్ల కుటుంబం నాలుగు ముక్కలైతది: అర్వింద్

బీఆర్ఎస్ ఓడితే కల్వకుంట్ల కుటుంబం నాలుగు ముక్కలైతది: అర్వింద్
  • నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​
  • ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా హరీశ్ వైపే ఉన్నారని కామెంట్
  • బీఆర్ఎస్​ మేనిఫెస్టోలో గల్ఫ్ బోర్డు ఏదని ప్రశ్న
  • సిరిసిల్లలో గల్ఫ్ కార్మికులు నామినేషన్లు వేయాలని సూచన


జగిత్యాల/కోరుట్ల, వెలుగు: రాష్ట్రాన్ని 60 ఏండ్లు కాంగ్రెస్ మోసం చేస్తే, 10 ఏండ్లుగా బీఆర్ఎస్ మోసం చేస్తోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. బీఆర్ఎస్  మేనిఫెస్టోలో గల్ఫ్ బోర్డు ప్రస్తావన ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. సోమవారం జగిత్యాల, కోరుట్లలో బీజేపీ అసెంబ్లీ  నియోజకవర్గ స్థాయి బూత్ కార్యకర్తల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడారు. యువరాజు కేటీఆర్ ఇలాకా సిరిసిల్లలో 400 నామినేషన్లు వేసి ఆయనను మత్తులోంచి దించాలని గల్ఫ్ కార్మికులను కోరారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతే కల్వకుంట్ల కుటుంబంలోని నలుగురు లీడర్లు నాలుగు దిక్కులు పోతారని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీక్రేట్ బ్యాలెట్ పెడితే కేటీఆర్ కంటే మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావుకే ఎక్కువ ఓట్లు వస్తాయని, అలా జరగకపోతే తాను గొంతు కోసుకుంటానని అర్వింద్ సవాల్ చేశారు. కోరుట్ల అసెంబ్లీ నుంచి తాను పోటీ చేస్తానన్న భయంతోనే ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ లో అభ్యర్థులకు బీఫాం ఇవ్వలేదన్నారు.

కాంగ్రెస్​కు ఓటేసినా, బీఆర్ఎస్ ఓటేసినా ఒక్కటే

తెలంగాణలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఓటేసినా.. బీఆర్ఎస్ కు వేసినా ఒక్కటేనని అర్వింద్​ అన్నారు. జగిత్యాల నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్కాం గురించి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మాట్లాడకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దళారీ వ్యవస్థను పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీకి అమరవీరుల ఉసురుకొట్టిందన్నారు.  తెలంగాణ సొమ్మును కొల్లగొట్టిన కవిత తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.  మోదీపై ఎక్కువగా మాట్లాడితే కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫుట్ బాల్ ఆడుతానన్నారు.

పసుపుబోర్డు కల సాకారం

దేశంలో మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలను తెరిపించిన ఘనత బీజేపీదేనని అర్వింద్​ అన్నారు. తెలంగాణలో చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించి నడిపించాలంటే  బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కలను ప్రధాని నరేంద్ర మోదీ సాకారం చేశారని అన్నారు. సమావేశంలో జిల్లా ప్రెసిడెంట్ 
మోరపల్లి సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగ శ్రావణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.