- దీదీ పీఎం అన్న టీఎంసీకి అసద్ కౌంటర్
- ముస్లింలపై దాడులను మోడీ ఖండించాలి
- కృష్ణ జన్మభూమిపై వివాదంపైనా వ్యాఖ్యలు
- పతంగ్ పయనమెటు.. చరఖా, మాంజా ఎవరిది?
ఎంఐఎం ఎవరికి మిత్రపక్షమో పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్. సీఎం కేసీఆర్ ప్రధాని పదవికి అన్ని విధాలుగా సమర్థుడని చెప్పుకొచ్చారు. మోదీని ఢీకొట్టే సత్తా కేసీఆర్ కే ఉందని పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకు మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన పతంగ్ పార్టీ ఎందుకు మాట మార్చింది..? దీని వెనుక కారణలేమిటన్నది ఆసక్తికరంగా మారింది.
హైదరాబాద్: దేశ ప్రధాని పదవికి కేసీఆర్ సమర్థుడు కాదా..? ఆయనకు ఏం తక్కువని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. భావి ప్రధాని దీదీ అంటూ తృణమూల్ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలకు ఈ హైదరాబాద్ ఎంపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేశంలోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అంటూ పేర్కొన్నారు. అప్పుల్లో కూడా తెలంగాణ టాపే కదా అన్న వ్యాఖ్యలనూ ఆయన చమత్కరించారు. భారత ప్రభుత్వం కూడా అప్పులు తీసుకున్నది కదా..? అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనే సత్తా కేసీఆర్ కే ఉందంటూ పేర్కొనడం గమనార్హం. తొమ్మిదేండ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధేమీ లేదని, నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటాయని పేర్కొన్నారు. ముస్లింలపైనే బుల్డోజర్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని విమర్శించారు. భారత్ లోకి చైనా చొరబాట్లపై ప్రధాని మౌనం వీడాలని పేర్కొన్నారు.
మెత్తబడ్డ పతంగ్ పార్టీ
మొన్నటి వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో పోటీ చేస్తామంటూ కామెంట్లు చేసిన ఎంఐఎం నేతలు ఇప్పుడు మెత్తబడుతున్నారు. ఇటీవల పాట్నా, బెంగళూరుల్లో జరిగిన విపక్ష కూటమి (ఇండియా) మీటింగ్ కు ఎంఐఎంకు ఆహ్వానం అందలేదు. ఆ తర్వాత పార్టీ అధికార ప్రతినిధి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఇండియా పక్షాలు తమను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. ఆ తర్వాత మణిపూర్ అంశంపై ఇండియా కూటమి పక్షాలు, బీఆర్ఎస్ వేర్వేరుగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి. ఆ సమయంలో ఎంఐఎం పార్లమెంటరీ పార్టీ అధినేత బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మాన నోటీసులోనే సంతకం చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల రాష్ట్రంలోని ముస్లింలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఎంఐఎం ముఖ్యనేతలు అసుదుద్దీన్, అక్బరుద్దీన్ పర్యటిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామనే సంకేతాలిచ్చారు. ఇప్పుడు ప్రధాని పదవికి సీఎం కేసీఆర్ అర్హుడంటూ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ప్రధాన్యాన్ని సంతరించుకున్నాయి.
కృష్ణ జన్మభూమిపై..
కృష్ణా జన్మభూమి-షాహీ ఈద్గా ప్రాంగణాన్ని శాస్త్రీయంగా సర్వే చేయాలని హిందూ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని చేసిన వ్యాఖ్యలపై అసద్ స్పందిస్తూ.. ‘ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేశారా..?’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.