కేసీఆర్ ఓ తుగ్లక్ ..ఓ నీరో చక్రవర్తి: బండి సంజయ్

కేసీఆర్ ఓ తుగ్లక్ ..ఓ నీరో చక్రవర్తి: బండి సంజయ్
  • సెక్రటేరియట్‌కే రానోడికి కొత్త సెక్రటేరియట్ ఎందుకు..?
  • మతిలేని కేబినేట్ నిర్ణయంతో రూ.500 కోట్ల ప్రజా ధనం వృధా
  • సెక్రటేరియట్ కూల్చివేతపై బండి సంజయ్ మండిపాటు

తెలంగాణలో నిజాం పాలన నాటి నిరంకుశ ,నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు బీజేపీ ఎంపీ బండి సంజ‌య్‌. చరిత్ర కలిగిన కట్టడం సెక్రెటరీయేట్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు, సరిపోయే విధంగా కట్టిన ఈ బిల్డింగ్ ను కేసీఆర్ పిచ్చి చాదస్తంతో, భూతాలు, ప్రేతాలు పట్టిన మానసిక రోగిలాగా ప్రవర్తిస్తూ…రాత్రికి రాత్రే కూలగొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని చెప్పారు. సెక్రెటరీయేట్ ను కూలగొట్టాలని కేసీఆర్ కేబినేట్ తీసుకున్న నిర్ణయం దుర్మార్గమైన చర్య అని అన్నారు. మతిలేని కేబినేట్ నిర్ణయాలవల్ల ఈ రోజు రూ.500 కోట్ల ప్రజా ధనం వృధా అవుతోందని అన్నారు. గతంలో ఉస్మానియా ఆస్పత్రి ని కూలగొట్టి, అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ కడతానని సీఎం మాటిచ్చార‌ని గుర్తు చేశారు. ఈ రోజు ఇదే రూ.500 కోట్లతో ఉస్మానియా హాస్పటల్ నిర్మాణం పూర్తయి ఉంటే, ప్రజల ప్రాణాలను కాపాడేదన్నారు.

కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో విలయ తాండవం చేస్తుండగా, ప్రజలంతా భయం గుప్పెట్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతుంటే… సెక్రటేరియట్ కూల్చివేత, డిజైనింగ్ కాంట్రాక్టుల పట్ల ఫామ్ హౌస్ లో ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందించడం వెనకున్న మర్మం ఏంట‌ని ప్ర‌శ్నించారు.

రాష్ట్రంలో లక్షలాదిమంది కరోనా బారినపడి ఆసుపత్రులు లేక , సరైన వైద్య సదుపాయం లేక, ప్రైవేటు కార్పోరేట్ ఆస్పత్రుల దోపిడీతో ప్రజలు ప్రాణాలతో అల్లాడుతుంటే…. వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కూల్చివేత పై సమయాన్ని కేటాయించడం విడ్డూరమ‌న్నారు.

ప‌లుమార్లు రాజ‌ధానులు మార్పు చేసిన మహమ్మద్ బిన్ తుగ్లక్ , రోమ్ రాజ్యం తగలబడి పోతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి తీరులా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారం ఉందని అన్నారు. గత ఆరు సంవత్సరాలుగా ఏనాడు సెక్రెటరీయేట్‌కు వెళ్లని ముఖ్యమంత్రి నేడు హడావిడిగా కూల్చివేయడాన్ని.. ప్రజల ప్రాణాలపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటన్నది ప్రజలు, ప్రజా సంఘాలు గమనించాల‌న్నారు.

పిచ్చి ఆవహించిన కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడాలని ప్రజలు కోరుతున్నాన‌న్నారు సంజ‌య్. తెలంగాణ లో ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఆస్తులు కాపాడడానికి, ఈ నియంత పాలనను తరిమి కొట్టడానికి ప్రజలు సమాయత్తం కావాలన్నారు. బండి వెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి….పాటను రాసిన బండి యాదగిరిని గుర్తు చేసుకుంటూ, తొందరలోనే కేసీఆర్ పాలనకు గోరి కడతామ‌న్నారు