ఎవరి కోసం ధర్నా చేసినవ్?

ఎవరి కోసం ధర్నా చేసినవ్?

హైదరాబాద్, వెలుగు: “కేసీఆర్ ధర్నా చేసింది తెలంగాణ రైతుల కోసమా? పంజాబ్ రైతుల కోసమా? సమాధానం చెప్పాలి. కేసీఆర్ ధర్నా చేస్తే కేంద్రం రైతు చట్టాలను రద్దు చేసిందా? గతంలో ఢిల్లీ పోయి వచ్చి కేంద్ర పథకాలు భేష్ అన్నడు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లొచ్చి ఇంకేం అంటడో చూడాలి” అని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆదివారం పార్టీ రాష్ర్ట ఆఫీసులో సంజయ్ మీడియాతో మాట్లాడారు. “పంజాబ్ రైతులకు రూ.3 లక్షలు ఇస్తానన్న  కేసీఆర్.. రాష్ట్రంలో రైతులు చనిపోతే డబ్బులు ఎందుకు ఇవ్వలేదు. కేసీఆర్ కారణంగా చనిపోయిన రైతులకు ముందు రూ.25 లక్షలు ఇవ్వాలి. ఆ తర్వాత కేంద్రాన్ని అడగాలి’’ అని డిమాండ్ చేశారు.

వానాకాలం పంట కొనాలని బీజేపీ డిమాండ్ చేస్తుంటే.. కేసీఆర్ మాత్రం రైస్ మిల్లర్లు గురించి ఆలోచిస్తున్నాడని బండి సంజయ్ మండిపడ్డారు. రైతులు గోసపడుతుంటే పట్టించుకోరా అని నిలదీశారు. రైతులకు భరోసా ఇచ్చేందుకు తాను జిల్లాలకు వెళ్తే.. టీఆర్ఎస్ నేతలు తనపై రాళ్ల దాడి చేశారని గుర్తుచేశారు. తమ పార్టీ కార్యకర్తల రక్తంతో రైతుల కల్లాలు తడిచాయని అన్నారు. వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వడ్లను వెంటనే కొనాలని డిమాండ్ చేశారు. “కేసీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు. ఒకసారి రైతు చట్టాలకు వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తడు. ఇంకోసారి రైతు చట్టాలకు మద్దతు ఇస్తున్న అంటడు. మరోసారి కోనుగోలు కేంద్రాలను తీసేస్త అంటడు. ఇంకోసారి ప్రతి గింజా రాష్ట్ర ప్రభుత్వమే కొంటది అంటడు. ఇప్పుడేమో వడ్లను కల్లాలకు తీసుకుని రావొద్దని చెప్తున్నడు. మళ్లీ కేంద్రంపై యుద్ధం అంటుండు. స్పష్టత లేదు.. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నడు’’ అని ఎద్దేవా చేశారు. కొనుగోలు కేంద్రాలపై మంత్రులు ఒక తీరుగా, కేసీఆర్ ఒక తీరుగా మాట్లాడుతున్నారని, రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకురావద్దని కేసీఆర్ చెప్తున్నాడని, మరి ఆయన ఫామ్ హౌస్ కు తీసుకు వెళ్లాలా అని సంజయ్‌‌ ప్రశ్నించారు.