
- మా లీడర్లను జైళ్లలో పెడితే భయపడతమా?
- బీజేపీ విజయానికి ఆ జైళ్లే నాంది అవుతయ్: బండి సంజయ్
- బీజేపీ కార్యకర్తల్ని బెంగాల్ సీఎం మాదిరి కేసీఆర్ వేధిస్తున్నరు
- ఎంఐఎం, టీఆర్ఎస్ మధ్య అనైతిక పొత్తు సాగుతోందని కామెంట్
న్యూఢిల్లీ, వెలుగు: వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మాదిరిగా.. సీఎం కేసీఆర్ కూడా బీజేపీ నాయకుల్ని, కార్యకర్తల్ని అణచివేసే కుట్ర చేస్తున్నారని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మమతను స్ఫూర్తిగా తీసుకుని, బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, జైళ్లలో పెడుతున్నారని మండిపడ్డారు. మంచి విషయాల్లో ఇతర రాష్ట్రాలను స్ఫూర్తిగా తీసుకోవాలని, కానీ రాష్ట్ర సీఎంకు మంచి అంటే తెలియదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నాయకుల్లా బీజేపీ కార్యకర్తలు లాఠీలకు భయపడే వాళ్లు కాదన్నారు. నాలుగు జిల్లాల బీజేపీ అధ్యక్షులను జైళ్లలో పెడితే భయపడుతమా అని ప్రశ్నించారు. ఆ జైళ్లే బీజేపీ విజయానికి నాంది అవుతాయని, టీఆర్ఎస్ పతనానికి కారణమవుతాయని హెచ్చరించారు. శుక్రవారం ఢిల్లీలోని విజయ్ చౌక్ లో బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి, ఎంపీలు అర్వింద్, బాపూరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
కబ్జాలను ప్రశ్నించిన గిరిజనులపై దాడులు
గిరిజనుల భూములను టీఆర్ఎస్ నేతలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. గుర్రంపోడు తండాలో హైకోర్టు ఉత్తర్వులు పని చేయడం లేదని విమర్శించారు. టీఆర్ఎస్ కబ్జాలను ప్రశ్నించిన గిరిజన యువతపై పోలీసులు దాడి చేశారని, 40 మందిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. గిరిజన యువతపై ఎందుకు లాఠీచార్జ్ చేశారని ప్రశ్నించారు. ఈ మధ్య తన సూర్యాపేట పర్యటనలో కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. మళ్లీ సూర్యాపేటకు వెళ్తానని, దమ్ముంటే ఆపాలని పోలీసులకు సవాల్ విసిరారు. ఐజీ ప్రభాకర్ రావు డైరెక్షన్ లోనే బీజేపీ శ్రేణులపై అక్రమ కేసులు బానాయిస్తున్నారని సంజయ్ చెప్పారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని, అక్రమ ఆస్తుల విషయంలో ప్రభాకర్ రావును వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
ఎందుకు మద్దతు తీసుకున్నరు?
మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య వాలెంటైన్స్‌డే గిఫ్ట్ అని సంజయ్ విమర్శించారు. ప్రేమికుల రోజున ఏదో ఒక పార్క్ లో కేసీఆర్, ఒవైసీ కలుసుకుంటారని ఎగతాళి చేశారు. ‘‘కలిసి భాగ్యనగరాన్ని పంచుకుందాం. కలిసి దోచుకుందాం” అని ఇద్దరు ప్రేమికులు అనుకుంటున్నారన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలది అనైతిక పొత్తు అని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎంఐఎంతో సంబంధం లేదని సీఎం కేసీఆర్ చెప్పారని, మరి మేయర్ అభ్యర్థి ఎంపికలో ఎందుకు ఆ పార్టీ మద్దతు తీసుకున్నారని ప్రశ్నించారు.
టీచర్లకు ప్రైవేటు సంస్థలు జీతాలివ్వాలె
రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేటు సంస్థలు తమ లెక్చరర్లు, టీచర్లకు జీతాలు చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేకుంటే త్వరలోనే బీజేపీ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యా సంస్థలు బాగా నడిచినప్పుడు కోట్ల రూపాయలు దండుకొని, ఇప్పుడు చేతులెత్తేయడం సరికాదన్నారు. కార్పొరేట్ కాలేజీలు ఇవ్వకపోతే ప్రభుత్వం వారిపై ఒత్తిడి చేయాలని పేర్కొన్నారు. జీతాలు అందక ఇప్పటికే 40 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి కేసీఆర్ రూ.లక్షలు దండుకుంటారని, అందుకే ఇప్పుడు ఒత్తిడి చేయడం లేదని ఆరోపించారు.
రైతుల ‘పసుపు గిఫ్ట్’
నిజామాబాద్ లో పండించిన పసుపును బీజేపీ రాష్ట్ర లీడర్లకు రైతులు గిఫ్ట్ గా ఇచ్చారు. శుక్రవారం ఢిల్లీలోని విజయ్ చౌక్ లో బండి సంజయ్‌కి రైతులు పసుపు బుట్టలను అందజేసి సన్మానించారు. వివేక్ వెంకటస్వామి, అర్వింద్‌కు కూడా పసుపు అందజేశారు. రోజు రోజుకు పసుపుకు డిమాండ్ పెరుగుతోందని, రైతులకు మంచి రేటు వస్తోందని అర్వింద్ తెలిపారు. ఆ సంతోషంతోనే రైతులు ఢిల్లీ వచ్చి సంజయ్ కి సన్మానం చేశారన్నారు.
For More News..