కేసీఆర్ వేములవాడ రాజన్నకు ఇచ్చిన మాట తప్పారు

కేసీఆర్ వేములవాడ రాజన్నకు ఇచ్చిన మాట తప్పారు
  • కేంద్ర నిధులతో ఆలయ అభివృద్ధి చేస్తామన్న ఎంపీ బండి సంజయ్

రాజన్న సిరిసిల్ల జిల్లా: అధికార పార్టీ మాయమాటలు నమ్మొద్దని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజలకు సూచించారు. సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్నకి ఇచ్చిన మాటనే తప్పారని అన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయిస్తామని చెప్పి మర్చిపోయారని చెప్పారు. తమను ఎంపీ ఎన్నికల్లో గెలిపించినట్లుగానే మునిసిపల్ ఎన్నికల్లోనూ బీజేపీకి పట్టం కట్టాలని కోరారు ఎంపీ బండి సంజయ్. రాజన్న క్షేత్రం కేంద్రంగా వేములవాడలో శనివారం ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజన్న ఆశీస్సులతో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామన్న ధీమా వ్యక్తం చేశారు.

అధికార పార్టీ ఓట్లెట్ల అడుగుతోంది

ఎన్నో ఏళ్లుగా రాజన్న క్షేత్రం అబివృద్దికి నోచుకొలేదన్నారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్నకి ఇచ్చిన మాట ప్రకారం 400 కోట్లు కేటాయించలేదని అన్నారు. కేంద్రం నిధులతో వేములవాడ రాజన్న ఆలయాన్ని అబివృద్ది  చేస్తామన్నారు. నిధులు లేవని చెబుతున్న అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు మళ్లీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగడానికి ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల వేళ ప్రజల దృష్టిని మళ్లించడానికి  ప్రభుత్వం కొత్త నాటకాలు ఆడుతోందన్నారు. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి, ఆ తర్వాత విదేశాలకు వెళ్లి పోవడం అధికార ఎమ్యెల్యేకి కామన్‌గా అయిపోయిందని ఆరోపించారు ఎంపీ బండి సంజయ్. అధికార పార్టీ యొక్క మాయమాటలు, మభ్యపెట్టే మాటలను నమ్మొద్దని ప్రజలకు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.