- హరీశ్ రావుపై ఎంపీ చామల ఫైర్
హైదరాబాద్, వెలుగు: సీఎం స్థాయి వ్యక్తిని పట్టుకొని తోలు తీస్తామని కేసీఆర్ అంటే రేవంత్ మర్యాదగా మాట్లాడాలా ? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరు ఎలా మాట్లాడాలనే నీతులను చెప్పాల్సింది తమకు కాదని, కేసీఆర్, కేటీఆర్ కు చెప్పాలని హరీశ్ రావుకు సూచించారు. బీఆర్ఎస్ నేతలు పద్ధతిగా మాట్లాడితే..రేవంత్ రెడ్డి పద్ధతిగా మాట్లాడుతారని స్పష్టం చేశారు. రాజకీయాల్లో తిట్ల పురాణం మొదలు పెట్టిందే కేసీఆర్ అని విమర్శించారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడాడని, ఆ తిట్ల పురాణం, బూతులను ఒకసారి హరీశ్ రావు గుర్తుచేసుకోవాలన్నారు. బూతులు మాట్లాడే పేటెంట్ హక్కులు కేసీఆర్ కే వచ్చాయా అని ఎద్దేవా చేశారు. నీతులు ఎదుటి వారికే తప్ప తమకు వర్తించవనే రీతిలో హరీశ్ రావు మాటలు ఉన్నాయని ఎంపీ చామల మండిపడ్డారు.
