- బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్
హైదరాబాద్, వెలుగు : 31,300 మంది నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెలగాటం ఆడుతున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి మండిపడ్డారు. గ్రూప్ 1 అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దని విజ్ఞప్తి చేశారు. శనివారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ని గౌరవంగా సీఎం రేవంత్ రెడ్డి చర్చలకు రమ్మని ఆహ్వానించారని చామల తెలిపారు.
కానీ ఆయన చర్చకు రాకుండా రోడ్ల మీద ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు. కోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ లు పరీక్షలు జరపమని ఇచ్చిన తీర్పుపై బండి సంజయ్ కి నమ్మకం లేదా అని నిలదీశారు. కేటీఆర్ తో చర్చలకు వచ్చిన వారికి ఎవరికైనా హాల్ టికెట్ ఉందా..? అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు మంచి జరగాలనే ప్రభుత్వం జీవో 29 ని తీసుకొచ్చిందని, ఈ జీవో తో అదనంగా 3,500 మందికి పరీక్ష రాసే అవకాశం వచ్చిందన్నారు. 54 శాతం ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దినని చామల పేర్కొన్నారు.