తెలంగాణలోని పెద్దపల్లి ప్రాంతానికి రావాల్సిన ఎయిర్ పోర్టు కేంద్ర ప్రభుత్వం కావాలనే వేరే ప్రాంతాలకు తరలించిందని ఎంపీ వంశీకృష్ణ ఆరోపించారు. పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. కేవలం బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకే ఎయిర్పోర్టులను తరలించుకుపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దపల్లికి ఎయిర్పోర్ట్ ఎంతో అవసరమని, అయితే రావాల్సిన విమానాశ్రయాన్ని రాకుండా అడ్డుకున్నారని వంశీకృష్ణ విమర్శించారు. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యతపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎయిర్పోర్టులు, ప్రాజెక్టులు ప్రారంభం కాకముందే లేదా కనీసం ఆరు నెలలు గడవక ముందే కుప్పకూలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. తమకు కేవలం హడావుడిగా కట్టే నిర్మాణాలు కాకుండా, తరాలపాటు నిలిచిపోయే నాణ్యమైన ఎయిర్పోర్ట్ కావాలని ఆయన డిమాండ్ చేశారు.
పార్లమెంట్లో ఎలాంటి సరైన చర్చలు, సలహాలు లేకుండానే కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తోందని వంశీకృష్ణ విమర్శించారు. ప్రాంతీయ అసమానతలను పక్కనపెట్టి, పెద్దపల్లి ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
