- కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌కు ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి
- పర్యావరణ అభివృద్ధి, పరిరక్షణకు మీతో కలిసి
- పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణతో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలో చేపడుతున్న పలు రోడ్ల విస్తరణ, అటవీ, గ్రామీణ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌తో ఎంపీ భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ భేటీలో.. తెలంగాణకు సంబంధించిన స్థిరమైన అభివృద్ధి, అటవీ సంరక్షణ, పారిశ్రామిక అనుమతులు, ఇతర కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పర్యావరణ అభివృద్ధి, పరిరక్షణకు కేంద్ర మంత్రిత్వ శాఖతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అలాగే పెద్దపల్లి నియోజకవర్గంలోని అనేక కీలకమైన రహదారి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అటవీ, పర్యావరణ అనుమతులకు త్వరితగతిన ఇవ్వాలని కోరారు. కోటపల్లి మండలంలోని మల్లంపేట్-నక్కలపల్లి (4.45 కి.మీ), రాజారాం- బబ్బేర చిలుక (2.14 కి.మీ), బొప్పారం అల్గావ్ (5.08 కి.మీ), పార్పల్లి కావర్ కొత్తపల్లి (3.69 కి.మీ), వేమనపల్లి ప్రాంతంలోని చిన్నరాస్పల్లె -వేమనపల్లి వయా నగారా, లింగాల, ఈటపల్లి (7.127 కి.మీ), రాచర్ల అర్జునగుట్ట వయా వేమనపల్లి, వేమనపల్లి ఫారెస్ట్ బెల్ట్‌లో అల్గావ్, రొయ్యలపల్లి, సిర్సా, అన్నారం (10.604 కి.మీ) ప్రాజెక్టులకు సంబంధించి త్వరగా ఎన్విరాన్మెంట్ పర్మిషన్లు ఇవ్వాలని కోరారు. ఎంపీ అభ్యర్థనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
రాహుల్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక...
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీజేపీ సర్కార్ సభను వాయిదా వేస్తూ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నిస్తోందని ఎంపీ వంశీకృష్ణ విమర్శించారు. భారత్- అమెరికా ట్రేడ్ డీల్‌పై రాహుల్ అడిగే ప్రశ్నలకు కేంద్రం వద్ద సమాధానం లేదన్నారు. తొలిదశ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో వంశీకృష్ణ మాట్లాడారు. ‘‘ట్రేడ్ డీల్ దేశాన్ని ప్రభావితం చేసింది. ఈ విషయంలో రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు బీజేపీ నోరు మెదపడం లేదు. ఒక దేశంగా భారత్.. అమెరికా పరిపాలనకు ఎందుకు తలొగ్గింది? ట్రంప్ నిర్దేశించిన చోట నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడానికి ఎందుకు అంగీకరించింది? రైతులు చేసే ఉత్పత్తులకు టారిఫ్ ఎందుకు తగ్గించారు? రూపాయి విలువ తగ్గింపు గురించి మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు?’’ అని ఎంపీ ప్రశ్నించారు.
