V6 News

కోటిలింగాల అభివృద్ధికి కృషి చేస్తా : పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

 కోటిలింగాల అభివృద్ధికి కృషి చేస్తా : పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం పార్వతి కోటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన స్వామి వారి కల్యాణంలో ఎంపీ పాల్గొన్నారు. తొలుత ఆలయ అర్చకులు సంప్రదాయ పద్ధతిలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాతో ఎంపీని సత్కరించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కోటిలింగాల ఆలయాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాన్ని ఇప్పటికే పార్లమెంట్‌‌‌‌లో ప్రస్తావించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంనుంచి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపడతానని హామీ ఇచ్చారు. శాతవాహనుల తొలి రాజధానిగా గుర్తింపు పొందిన కోటిలింగాలను పర్యాటక హబ్‌‌‌‌గా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.