- రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చేవరకూ పోరాడతా
- రేషన్ బియ్యం పంపిణీ సక్రమంగా జరగాలి
- అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక
- గోదావరిఖనిలో అంబేద్కర్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన ఎంపీ
పెద్దపల్లి/ గోదావరిఖని, వెలుగు: తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షపై పార్లమెంట్లో గళమెత్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పర్యటించిన ఆయన స్థానిక సింగరేణి స్టేడియంలో సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న అంబేద్కర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాలలో తెలంగాణకు రావలసిన నిధులపై ప్రశ్నించానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నిధులు కేటాయిస్తూ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు ఎందుకు న్యాయం చేయడం లేదని నిలదీశానని చెప్పారు. ఏపీలో 9 విమానాశ్రయాలు ఉండగా తెలంగాణలో ఒకే ఒక్క ఎయిర్ పోర్ట్ ఉండడం వివక్షకాక మరేమిటని ప్రశ్నించారు.
తెలంగాణకు సెమీ కండక్టర్ పరిశ్రమను కేటాయించాలని పార్లమెంటులో ప్రస్తావించగా, దానిని ఏపీకి కేటాయించారని మండిపడ్డారు. రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటునూ కేంద్రం పట్టించుకోవడంలేదని, కార్మికుల సంక్షేమం కోసం ఆసుపత్రి మంజూరయ్యే వరకూ పోరాడుతానని స్పష్టం చేశారు. గతంలో దివంగత కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి కృషి వల్ల సింగరేణి కార్మికులకు పెన్షన్ సౌకర్యం లభించిందని, వారికి కనీస పెన్షన్ రూ.10 వేలకు పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు చెప్పారు.
అధికారులకు ఇస్తున్నట్టుగా సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు కోసం పార్లమెంట్లో మాట్లాడినట్టు చెప్పారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల కోసం మౌలిక సదుపాయాలు కల్పించేలా దక్షిణ మధ్య రైల్వే అధికారులతో మాట్లాడాలని ఎంపీ వంశీకృష్ణకు రైల్వే యూజర్స్ కమిటీ మెంబర్ అనుమాస శ్రీనివాస్ (జీన్స్) వినతిపత్రం అందజేశారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాలలో సామాజిక సమతా వేదిక ప్రతినిధులు పులి మోహన్, జేవీ రాజు, సాయి కుమార్, లీడర్లు కామ విజయ్, జావెద్, తిప్పారపు మధు, దీపక్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు..
రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రేషన్ డీలర్లకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచించారు. బుధవారం పెద్దపల్లి జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఓదెల మండలం కొలనూర్‌లోని ఓ రేషన్ షాపును ఆకస్మికంగా పరిశీలించారు. రాబోయే మూడు నెలలకు సరిపడా బియ్యం నిల్వల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంపిణీ అవుతున్న బియ్యం పరిమాణం, నాణ్యతను పరిశీలించారు. బియ్యం తీసుకోవడానికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ స్వయంగా కొంతమంది లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు చేరాలని, ఎలాంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం పెద్దపల్లి పట్టణంలోని కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు.
త్వరలోనే పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానన్నారు. అనంతరం కాల్వ శ్రీరాంపూర్మండలం పెగడపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ లీడర్ కూతురు పెళ్లికి హజరయ్యారు. నూతన వధూవరులు సౌమ్యప్రియ, దివాకర్‌ను ఆశీర్వదించారు. తర్వాత జూలపల్లి మండల కేంద్రానికి చెందిన కాకా కుటుంబ అభిమాని పాటాకుల మహేశ్ తండ్రి ఇటీవల చనిపోయిన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని ఎంపీ పరామర్శించారు. అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో సయ్యద్ సజ్జాద్, అల్లం సతీష్, గుండేటి ఐలయ్య యాదవ్, బండారు సునీల్, ఆరెపల్లి రాహుల్, పత్తి లక్ష్మారెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.
