
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రదాడిపై చర్చకు పట్టుబట్టిన కాంగ్రెస్ మంగళవారం ( జులై 22 ) పార్లమెంట్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ వైఖరిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. బీహార్ ఎన్నికల క్రమంలో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ( SIR ) ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఎంపీ వంశీకృష్ణ. బీజేపీ చిల్లర రాజకీయాలకు, నియంతృత్వ పాలనకు SIR నిదర్శనమని అన్నారు.
తమ ఓటర్లను వెతుక్కొని వారికే వోట్ వేసేలా చేయడమే SIR వెనుక ముఖ్య ఉద్దేశమని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ విధానం ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు వంశీకృష్ణ. ఈ అంశంపై ఎన్నికల సంఘం కూడా బీజేపీకి ఇంతగా ఎందుకు సపోర్ట్ చేస్తుందో ప్రజలు గమనించాలని అన్నారు.
ఆధార్ కార్డు లాంటి అన్ని డీటెయిల్స్ ఉన్న కార్డు ఉన్నప్పుడు కొత్తగా SIR అవసరం ఏముందని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించిందని అన్నారు. ఇది కేవలం బీజేపీ నియంతృత్వ పాలనకు నిదర్శనమని.. ఈ విధానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని అన్నారు ఎంపీ వంశీకృష్ణ. ఇప్పుడు బీహార్ తో మొదలై.. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే విధానం అమలు చేసే అవకాశం ఉందని అన్నారు. ఈ విధానాన్ని అందరు వ్యతిరేకించాలని అన్నారు.
ఇక సోమవారం ( జులై 21 ) పార్లమెంట్ సమావేశాల్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ ఆపరేషన్ సిందూర్ పై చర్చకు పట్టుబట్టారని.. ఆయనకు కనీసం అవకాశం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమా.. నియంతృత్వ పాలనా అన్నది ప్రజలు గమనించాలని అన్నారు. రాహుల్ గాంధీ అంశంపై చర్చకు అవకాశం ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగామని తెలిపారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని అన్నారు.
ఉపరాష్ట్రపతి ధన్కడ్ రాజీనామాపై స్పందించిన ఎంపీ వంశీకృష్ణ సోమవారం ఉదయం పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టంగా, యాక్టివ్ గా మాట్లాడిన ధన్కడ్ సాయంత్రానికి అనారోగ్య కారణాలతో రాజీనామా ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఇది కేవలం బీజేపీకి నచ్చినవాళ్లను అవసరం ఉన్నప్పుడు వాడుకొని, అవసరం తీరాక పక్కనపెట్టడమేనని అన్నారు ఎంపీ వంశీకృష్ణ.