పీఎం ఆవాస్ యోజన పైసల్ని తెలంగాణ దారి మళ్లించింది!

పీఎం ఆవాస్ యోజన పైసల్ని తెలంగాణ దారి మళ్లించింది!

న్యూఢిల్లీ, వెలుగు : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీంలో కేంద్రం ఇచ్చిన దాదాపు రూ.3,445 కోట్లను తెలంగాణ సర్కార్ దారి మళ్లించిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. పీఎం ఆవాస్ యోజనలో దాదాపు రెండున్నర లక్షల ఇండ్లను కేంద్రం, రాష్ట్రానికి మంజూరు చేసిందన్నారు. దురదృష్టవశాత్తు డబుల్ బెడ్ రూం పేరుతో కేసీఆర్ సర్కార్ పేదలకు ఇండ్లను అందించలేకపోయిందన్నారు. మంగళవారం రాజ్యసభలో ‘సప్లమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్’ చర్చలో లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు.

JOఇండ్ల నిర్మాణం కోసం ఇచ్చిన నిధుల్ని తెలంగాణ ప్రభుత్వం మిస్ యూజ్ చేసిందని ఆరోపించారు. చివరికి 30వేల మందికే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చిందన్నారు. కానీ, తాను ఎంపీగా ఎన్నికైన యూపీలో మాత్రం ఐదేండ్లలో యోగి సర్కార్ దా దాపు 50లక్షల ఇండ్లు పేదలకు ఇచ్చిందన్నారు. 25శాతానికి పైగా నిధులను రైతులకు సబ్సిడీ (ఫెర్టిలైజర్), పేదల సంక్షేమం కోసం ఖర్చు చేసిందన్నారు. రూ.1.10లక్షల కోట్లను ఫెర్టిలైజర్ సబ్సిడీ కింద ఖర్చు చేస్తుందన్నారు. ‘‘ఒకప్పుడు తెలంగాణలో ఎరువుల కోసం రైతులకు బదులు.. చెప్పులు క్యూలో ఉండేవి”అని ఎంపీ లక్ష్మణ్​ గుర్తు చేశారు. 

33లక్షల రైతులు లబ్ది పొందుతున్నరు

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా తెలంగాణలోని దాదాపు 81% రైతులు లబ్ది పొందుతున్నారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. అంటే దాదాపు 33లక్షల మందికి ఈ స్కీం ద్వారా మేలు జరుగుతున్నదన్నారు. జన్​ధన్​ యోజన ద్వారా కేంద్రం అందించే నిధులు నేరుగా లబ్దిదారుల అకౌంట్లోకి చేరుతున్నాయన్నారు.