30 లక్షల మంది నిరుద్యోగులను.. కేసీఆర్ దగా చేసిండు: ఎంపీ లక్ష్మణ్

30 లక్షల మంది నిరుద్యోగులను.. కేసీఆర్ దగా చేసిండు: ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదల, వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ 24 గంటల దీక్ష చేపట్టనున్నట్లు బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ తెలిపారు. ఇందిరా పార్క్ వేదికగా ఈ నెల 13న చేపట్టనున్న ధర్నాలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ లేదా డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, మార్చి లేదా ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. 

రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అవినీతి పాలనకు తెలంగాణ యువత చరమగీతం పాడుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, వాటిని భర్తీ చేయకుండా 30 లక్షల మంది నిరుద్యోగ యువతను కేసీఆర్ దగా చేశారని ఆరోపించారు. ఆ 30 లక్షల మందికి బీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగ భృతి బాకీ పడిందని గుర్తు చేశారు. రాజకీయ కొలువుల భర్తీపై ఉండే శ్రద్ధ ఉద్యోగాల భర్తీపై లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో కేసీఆర్ కి యువత బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. 

సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని పేద ప్రజలకు కానుకగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ‘ధన్యవాద్ మోదీజీ’ పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు జమిలీ ఎన్నికలు జరిపేందుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అయితే ఎప్పుడు కార్యరూపం దాల్చుతాయనేది మాజీ రాష్ట్రపతి నివేదిక వచ్చాక స్పష్టత వస్తుందన్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును బీజేపీ తప్పుపడుతున్నట్లు చెప్పారు. ఎఫ్ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం సరికాదని విమర్శించారు.