రైతులకు ద్రోహం చేసింది కేసీఆర్ సర్కారే:ఎంపీ లక్ష్మణ్

రైతులకు ద్రోహం చేసింది కేసీఆర్ సర్కారే:ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: రైతులకు అత్యంత ద్రోహం చేస్తున్నది కేసీఆర్ సర్కారేనని బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. తెలంగాణలో ఫసల్ భీమా పథకం అమలుకు నోచుకోవట్లేదని, రైతులకు కేంద్రం నుంచి మేలు జరిగితే తననెక్కడ మరిచిపోతారోననే భయం సీఎం కేసీఆర్​ను వెంటాడుతోందని కామెంట్ చేశారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పేరుతో రాజకీయ లబ్ధి పొంది, కుటుంబాన్ని బాగు చేయడం మినహా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తీరు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేక పోయినట్లుందని ఆరోపించారు. రూ. లక్ష కోట్లతో కట్టి అభాసు పాలయారన్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్​ను అమలు చేయకపోవడంతో వేల కుటుంబాలు కరోనా టైంలో నష్టపోయాయన్నారు. బీజేపీ నుంచి, ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడితో దానిని అమలు చేస్తున్నామని చెప్పినా.. సరైన గైడ్ లైన్స్ ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో డబల్ బెడ్ రూమ్ లు ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. ఎస్సీ విద్యార్థులకు కేంద్రం రూ. 250 కోట్ల స్కాలర్ షిప్ ఇస్తే.. కేసీఆర్ మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వక దళిత విద్యార్థులకు అందకుండా చేశారని విమర్శించారు. 

హాస్టల్ పిల్లలకు తిండి కూడా పెడ్తలేరు

సర్కారు హాస్టళ్లలో భోజనం సక్కగ పెట్టట్లేదని, పెట్టే తిండిని కూడా విషపూరితం చేసింది కేసీఆర్ సర్కారేనని లక్ష్మణ్ మండిపడ్డారు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర సర్కార్ నిధులు ఇవ్వకపోవడంతో భూ సేకరణ ఆగిపోతుందన్నారు. ఉపాధి నిధులు కేంద్రం ఇస్తే.. కూలీలకు ఉపాధి కల్పించకుండా రూ.150 కోట్లు కాంట్రాక్టర్లకు దారి మళ్లించారన్నారు. రూ.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల పేరు మార్పు, కేంద్రం నిధుల మళ్లింపు, కేంద్ర ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం వంటి పలు అంశాలపై రాజ్యసభలో ప్రస్తావించినట్లు లక్ష్మణ్ చెప్పారు.