కేసీఆర్ 5 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేసిండు : ఎంపీ లక్ష్మణ్

కేసీఆర్ 5 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేసిండు : ఎంపీ లక్ష్మణ్

రాజ్యసభలో తెలంగాణ, అటు ఆంధ్ర గొంతుగా మారడం అదృష్టంగా భావిస్తున్నానని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాజ్యసభ సభ్యునిగా కొత్త అనుభూతి కలిగిందన్నారు. ప్రతిపక్షాలు అంతరాయం పెట్టినా అర్థవంతమైన చర్చలు జరిగాయన్నారు. అసెంబ్లీతో పోలిస్తే పార్లమెంట్ భేషజాలు లేకుండా అన్ని పార్టీల సభ్యులకు అవకాశం ఇచ్చారని ఆయన చెప్పారు. తెలంగాణలో కేంద్ర పథకాల పేరు మార్పు, నిధుల మళ్లింపు విషయాలను కూడా పార్లమెంట్‭లో ప్రస్తావించే అవకాశం వచ్చిందని తెలిపారు. అలాగే.. విద్యుత్ డిస్కం సమస్యలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవ్వడం, HMT  భూములు అన్యాక్రాంతం కావడాన్ని ప్రస్తావించానన్నారు. ఆవాస్ యోజన పథకాల నిధుల మల్లింపు అంశాన్ని కూడా లేవనెత్తానని చెప్పారు.  అయితే.. తాను అడిగిన వాటిలో15 ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానం వచ్చిందని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు.  

మోడీ ప్రభుత్వం చిన్న కులాలకు న్యాయం చేస్తోందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఎస్టీలకు రిజర్వేషన్ పెంపు విషయంలో కూడా కేసీఆర్ మోసం చేశారని ఆయన ఆరోపించారు. పనికి ఆహారం పథకంలో పనులు కాంట్రాక్టర్లకు ఇచ్చి నిధుల దుర్వినియోగం చెయ్యడాన్ని పార్లమెంట్ సాక్షిగా చెప్పే అవకాశం వచ్చిందని గుర్తు చేశారు. రైతులకు కేసీఆర్ సర్కార్ అంత్యంత ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో ఫసల్ భీమా అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఆయుష్మాన్ భారత్‭ను అమలు చెయ్యక పోవడంతో వేల కుటుంబాలు కరోనా సమయంలో నష్టపోయాయని చెప్పారు. యూపీలో 5 సంవత్సరాలలో ఆవాస్ యోజన కింద 50 లక్షల ఇండ్లు పూర్తయ్యాయని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. 

తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్‭లు ఎంత మందికి ఇచ్చారని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.  కేంద్రం ఎస్సీ విద్యార్థులకు 250 కోట్ల స్కాలర్షిప్ ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా కేసీఆర్ దళిత విద్యార్థులను మోసం చేశారన్నారు. రాంజీ గొండ్ మ్యూజియం కోసం 2018లో రూ.15 కోట్లు ఇస్తే ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. కేంద్రం ఉపాధి నిధులు ఇస్తే.. రూ.150 కోట్లు కాంట్రాక్టర్లకు దారి మళ్లించారని మండిపడ్డారు. రాష్ట్రం వాటా ఇవ్వకపోగా కేంద్రం మీద నెపం నెడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేసి ఏం చేశారని నిలదీశారు. ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక బీజేపీ పై నెపం నెడుతోందని రాష్ట్ర ప్రభుత్వం పై ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.