- కుమ్మెర ఘటనపై ఎంపీ మల్లు రవి
- నెలలు నిండకముందే పుట్టడంతో చనిపోయిందన్న ఎంపీ
హైదరాబాద్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘర్షణకు, పాప మృతికి ఎలాంటి సంబంధం లేదని ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. శనివారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుమ్మెర మల్లన్న జాతరలో ఫిబ్రవరి 18న ఘర్షణ జరిగితే 21న పాప మృతి చెందిందని తెలిపారు. ఈ ఘర్షణ సమయంలో ఆ పాప అక్కడ లేదన్నారు. జాతరలో కొబ్బరికాయలు ఎక్కువ ధరకు అమ్ముతున్నారనే విషయంలో గణేశ్, శ్రీనివాస్ రెడ్డికి మధ్య గొడవ జరిగిందని చెప్పారు.
అయితే గణేశ్ కూతురు నెలలు నిండకముందే పుట్టడంతో ఆ పాపకు లంగ్స్ సమస్య ఎక్కువై చనిపోయిందని వివరించారు. ఈ ఘర్షణను పాప మృతికి ముడిపెట్టడం సరికాదన్నారు. పాప తల్లి ఎస్సీ కాదని, కానీ చిన్నారి మృతికి కారకులయ్యారనే నెపంతో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కొందరు బీఆర్ఎస్ నేతలు కలిసి రాజకీయం చేస్తూ అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. దీన్ని ప్రజా సంఘాలు, మీడియా సంస్థలు అర్థం చేసుకోవాలని కోరారు.
