రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్ లో కొట్లాడ్తం... మల్లు రవి

రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్ లో కొట్లాడ్తం... మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్ లో కొట్లాడుతామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ,  పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని ప్రశ్నిస్తామన్నారు. మంగళవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర హక్కుల సాధన కోసం ప్రజల పక్షాన కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వేదికగా తమ గళాన్ని వినిపిస్తారని తెలిపారు. స్కూల్ ఎడ్యుకేషన్ కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ.2 వేల కోట్లను  విడుదల చేశారని చెప్పారు. ఈ నిధులతో స్కూళ్లల్లో సదుపాయాలను కల్పించి విద్యార్థుల శాతాన్ని పెంచుతామని పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్నట్టు రాష్ట్రంలోని స్కూళ్లు ఉండేలా రేవంత్ సర్కారు కృషి చేస్తుందని వివరించారు.

తెలంగాణలో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనను స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో సరైన సౌకర్యాలు లేవని, సెమీ రెసిడెన్షియల్స్ స్కూళ్లతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. టీచర్లు లేరనే కారణంతో గత ప్రభుత్వం స్కూళ్లను మూసివేసిందని, అలాంటి వాటిని మళ్లీ తెరుస్తామన్నారు. ఏకోపాధ్యాయ స్కూళ్లను రద్దు చేయబోమని సీఎం హామీ ఇచ్చారన్నారు.