హైదరాబాద్: త్వరలో రాహుల్ ప్రధాని కావడం ఖాయమని ఎంపీ మల్లురవి అన్నారు. ఇవాళ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని గాంధీ భవన్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కేక్‌లు కట్ చేశారు. బుక్స్, పెన్స్ పంపిణీ చేశారు.
కాగా పెద్దమ్మ గుడిలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్యర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. గాంధీ భవన్లో మల్లు రవి మాట్లాడుతూ ఏ క్షణమైనా ఎన్డీఏ సర్కార్ కూలిపోతుందని రాహుల్ చెప్పారన్నారు. నితీశ్ కుమార్, చంద్రబాబుల ఆధారపడి మోడీ సర్కార్ నడుస్తుందన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రావాలని చిన్న చిన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. మోడీ ప్రభుత్వంలో ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో అందరికి తెలుసన్నారు.
స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను ప్రజలకు అందించాలని రాహుల్ చూశారన్నారు. భాష వేరైనా బాధలు ఒక్కటే అని రాహుల్ అన్నారని తెలిపారు. బీజేపీకి 400 సీట్లు వస్తాయని మోడీ అనుకుంటే రాహుల్ యాత్రలతో 240కే పరిమితం అయ్యిందన్నారు. మూడు కాళ్ల మీద నడిచే గుర్రంలా మోడీ సర్కార్ ఉందని సెటైర్ వేశారు. మరికొద్ది రోజుల్లో సర్కార్ రైతు రుణమాఫీని చేస్తుందని, దానిపై సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారన్నారు.
రాహుల్ టార్గెట్ గా మోడీ సర్కార్
రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీనిమోడీ సర్కార్ టార్గెట్ గా చేసిందన్నారు. రాహుల్ గాంధీ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని అన్నారు. అంచలంచలుగా రాహుల్ ఎదిగారన్నారు. ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా రాహుల్ తీసుకోలేదన్నారు. పార్లమెంట్ లో ప్రశ్నించినందుకు రాహుల్ఇంటిని ఖాళీ చేయించారన్నారు. రాహుల్ చాలామందికి ఆదర్శమన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ ఓ బ్రాండ్ గా మారారని చెప్పారు. యువతకు ప్రాధాన్యత ఇవ్వడంలో రాహుల్ ముందుంటారన్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్, సీఎంగా చేయడంలో రాహుల్ నిర్ణయమేనని అన్నారు.
