కాంగ్రెస్​లోకి చేరిన ఎంపీ పసునూరి దయాకర్

కాంగ్రెస్​లోకి  చేరిన ఎంపీ పసునూరి దయాకర్
  • ఉద్యమంతో సంబంధం లేని కడియం కావ్యకు కేసీఆర్ ఎంపీ టికెట్ ఇచ్చారని మండిపాటు
  • వరంగల్​లో పార్టీని ఎర్రబెల్లి, కడియం భ్రష్టు పట్టించారు
  • రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలన అందిస్తున్నదని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని కడియం కావ్యకు  కేసీఆర్ వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చారని ఎంపీ పసునూరి దయాకర్ మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ను ఎర్రబెల్లి దయాకర్​రావు, కడియం శ్రీహరి భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం పసునూరి దయాకర్​ గాంధీభవన్ లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్​కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. ఆయనకు మహేశ్​కుమార్ గౌడ్ కండువా కప్పి  పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ,  గత 23ఏండ్ల నుంచి ఉద్యమం లో  కార్యకర్తగా పనిచేశానని, రెండు సార్లు ఎంపీగా గెలిచానని,  రాను రాను బీఆర్ఎస్ లో ఎన్నో మార్పులు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ ప్రజాపాలన అందిస్తున్నదని, ఆరు గ్యారంటీల అమలు చూసి పార్టీకి ఆకర్షితుడినయ్యానని చెప్పారు. సీఎం, మంత్రులు, అధికారులకు నిత్యం వందలాది మంది ప్రజాపాలనలో అప్లికేషన్లు అందిస్తూ తమ సమస్యలు చెప్పుకుంటున్నారని, గత పదేండ్లలో ఎప్పుడూ ఇలా జరుగలేదని ఆయన గుర్తుచేశారు.

బీఆర్ఎస్ లో రెండుసార్లు ఎంపీగా ఉన్నా తనకు ప్రొటోకాల్​ ప్రకారం గౌరవం ఇవ్వలేదని, ఎంతో అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.  తనకు సమాచారం ఇవ్వకుండానే పార్టీ మీటింగ్ లు పెట్టారని,  తీవ్ర వివక్ష చూపించారని తెలిపారు. వరంగల్ పార్టీ మీటింగ్ లకు, ప్రభుత్వ  కార్యక్రమాలకు పోవాలన్నా తాను అనుమతి తీసుకోవాల్సిందేనని అన్నారు. మంత్రి కొండా సురేఖ దగ్గర క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తానని , కాంగ్రెస్ లో పార్టీ నేతలకు, కార్యకర్తలకు స్వేచ్ఛగా పనిచేసే అ వకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

బీఆర్ఎస్ లీడర్లను కేసీఆర్ బెదిరిస్తున్నరు: మంత్రి కొండా సురేఖ

బీఆర్ఎస్​నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది మారేందుకు సిద్ధంగా ఉన్నా కేసీఆర్ వాళ్లను బెదిరించి, అడ్డుకుంటున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.  తెలంగాణలో ప్రజల అభీష్టం మేరకు  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో  ప్రజలు.. సీఎం, మంత్రులు, ఉన్నతాధికారుల దగ్గరకు, ప్రజా భవన్ కు వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారని తెలిపారు.  బీఆర్ఎస్ పాలనలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు అవకాశమే లేదని, మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం సీఎం అపాయింట్​మెంట్​ ఇచ్చేవారు కాదని అన్నారు.