- ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ ఏర్పాటు కోసం గజ్జె కట్టి ఆటపాటలతో ప్రజలను చైతన్యపరిచిన ఉద్యమ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఉద్యమ కళాకారులకు న్యాయం చేయాలని కోరతామని చెప్పారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో బీసీ కళామండలి జాతీయ అధ్యక్షుడు సిరసన వాడ రామలింగం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. దీనికి హాజరైన ఎంపీ ఆర్. కృష్ణయ్య, బీసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్‌ను ఉద్యమ కళాకారులు కలిసి తమ సమస్యలను వివరించారు.
అనంతరం ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కళాకారులు తమ గొంతుతో ప్రజలను చైతన్య పరిచారని ప్రశంసించారు.కానీ, గత ప్రభుత్వంలో కొందరికే ప్రయోజనాలు అందాయని తెలిపారు. ప్రస్తుతం అనేకమంది కళాకారులు దీనస్థితిలో ఉన్నారని, వారిని ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో బీసీలపై అగ్రకుల దాడులు, దౌర్జన్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
