కస్తూర్భా టీచర్లకు వర్క్ ఆర్డర్స్ ఇవ్వాలి..ఆర్ కృష్ణయ్య డిమాండ్

కస్తూర్భా టీచర్లకు వర్క్ ఆర్డర్స్ ఇవ్వాలి..ఆర్ కృష్ణయ్య డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వం విద్య రంగాన్ని, ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు రాజ్యసభసభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. కస్తూర్భా గాంధీ టీచర్ లకు వర్క్ ఆర్డర్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఆయన మే 2వ తేదీ మంగళవారం బషీర్ బాగ్ లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని కస్తూర్భా గాంధీ టీచర్లతో కలిసి ముట్టడించారు. ఆర్ కృష్ణయ్య కార్యాలయం గేటు ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న టీచర్లకు మద్దతు తెలిపారు. కస్తూర్భా గాంధీ పాఠశాలలో టీచర్లతో విద్యాశాఖ అధికారులు వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని మండిపడ్డారు. 

కేంద్ర ప్రభుత్వ నిధుల తోనే వీరికి జీతాలు చెల్లిస్తున్నారని.. కానీ ఆ నిధులను కొంత మంది అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు ఆర్ కృష్ణయ్య. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు వీరిని కాంట్రాక్టు ఉద్యోగుల కింద పరిగణించి.. వీరి పోస్టులను రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారాయన. రాష్ట్రంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు భూదందాలు చేస్తున్నారని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నట్లు స్వయాన ముఖ్యమంత్రి బయటపెట్టారని.. వీరిపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. అవినీతి ఎమ్మెల్యేల ఆస్తులను స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు పంచిపెట్టాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య.