బషీర్బాగ్, ముషీరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తే బీసీలంతా ఏకమై తిరగబడతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. ఇండియా కూటమికి బీసీ మహిళలపై చిత్తశుద్ధి ఉంటే, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.
ఆదివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి ప్రధానిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. బీసీలపై సీఎంకు ప్రేముంటే 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉండాలని చెప్పారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోవాలని సూచించారు.
మహిళా బిల్లు తిరస్కరణకు గురికావడం బాధాకరం
1996 నుంచి ఇప్పటివరకు మహిళా బిల్లును చట్టసభల్లో ఏడు సార్లు ప్రవేశపెట్టినా ఓటింగ్ ద్వారా అడ్డుకోవడం బాధాకరమని ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో జరిగిన బీసీ మహిళా సమావేశానికి ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు.

