గజ్వేల్ రింగ్ రోడ్డు పూర్తికి చొరవ చూపుతా : ఎంపీ రఘునందన్ రావు

గజ్వేల్ రింగ్ రోడ్డు పూర్తికి చొరవ చూపుతా : ఎంపీ రఘునందన్ రావు

గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా గజ్వేల్  పట్టణంలో ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉన్న రింగ్  రోడ్డు పనులను పూర్తి చేసేందుకు తాను ప్రత్యేక చొరవ తీసుకుంటానని మెదక్  ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. శనివారం బీజేపీ నాయకులతో కలిసి రింగ్  రోడ్డు పెండింగ్  పనులను పరిశీలించారు.  పనులు ఎక్కడ ఆగిపోయాయి, సమస్య ఎక్కడ ఉందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. గజ్వేల్ రింగ్  రోడ్డు పూర్తి చేసేందుకు151 మీటర్ల భూసేకరణ పెండింగ్‌‌‌‌లో ఉండడం విచారకరమన్నారు.

ఒక్క రైతును పిలిచి మాట్లాడి ఒప్పించడంలో జిల్లా యంత్రాంగం, రెవెన్యూ అధికారులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. అధికారుల అలసత్వం వల్లే ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని విమర్శించారు. రింగ్​రోడ్డు పనులు పూర్తి చేసేందుకు సీఎం సానుకూలంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు జరగకపోవడంపై మండిపడ్డారు. ఎంపీగా ఈ సమస్య పరిష్కారానికి తానే స్వయంగా చొరవ తీసుకుంటానని తెలిపారు. రైతుతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తానని, రైతు అంగీకరించని పక్షంలో చట్ట ప్రకారం భూసేకరణ చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని చెప్పారు.