కాళేశ్వరం పై ముక్కలు ముక్కలుగా విచారణ ఎందుకు? : ఎంపీ రఘు నందన్ రావు

కాళేశ్వరం పై ముక్కలు ముక్కలుగా విచారణ ఎందుకు? :  ఎంపీ రఘు నందన్ రావు
  •     ఎంపీ రఘునందన్ రావు ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు మొత్తం మీద కాకుండా.. కేవలం ముక్కలు ముక్కలుగా విచారణ ఎందుకు అడుగుతోందని ప్రశ్నించారు. లక్ష కోట్ల ప్రాజెక్టులో అ నుంచి ఱ దాకా ఎంక్వైరీ చేయమని అడగడానికి భయమెందుకో చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు రఘునందన్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముగ్గురు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయడం లేదని ఆరోపించడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ద్వారా బ్యారేజీలపై విచారణ చేసి రిపోర్టును అసెంబ్లీలో పెట్టారని, దీనిపై కేసీఆర్, హరీశ్ రావు కోర్టుకు వెళ్లడంతో.. తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా విచారణ చేయొద్దని హైకోర్టు చెప్పిన విషయం తెలిసి కూడా మంత్రులు బీజేపీపై బురద చల్లడం సరికాదన్నారు. అక్బరుద్దీన్‌‌ కబ్జా చేసి కాలేజీ కట్టిన సల్కం చెరువులో గాంధీ విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు.