మోడీ కన్నీళ్లు.. చనిపోయిన వారి కుటుంబాల కన్నీళ్లు తుడవలేవు

మోడీ కన్నీళ్లు.. చనిపోయిన వారి కుటుంబాల కన్నీళ్లు తుడవలేవు
  • కరోనాను గాలికొదిలేసి బెంగాల్ ఎన్నికలపై దృష్టి పెట్టారు
  • సెకండ్ వేవ్‌లో అందుకే మరింత మంది చనిపోయారు
  • కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

కరోనా థర్డ్ వేవ్‌‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్దంగా ఉండాలంటూ ప్రధాని మోడీ చెప్పడమంటే.. మరికొన్ని మ్యూటేషన్లు రాబోతున్నాయనడానికి సంకేతమేనని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కరోనా థర్డ్ వేవ్‌‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఏం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందో తెలుపుతూ శ్వేతపత్రం విడుదలచేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే కరోనా సెకండ్ వేవ్‌లో చాలా మంది అనవసరంగా చనిపోయారని ఆయన అన్నారు. ‘మోడీ కన్నీళ్లు.. కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాల కన్నీళ్లను తుడిచివేయలేవు. అతని కన్నీళ్లు చనిపోయిన వారి కుటుంబాలను రక్షించలేవు. ఆక్సిజన్ అందక చాలామంది చనిపోయారు. ఆక్సిజన్ కొరత లేకుంటే వారంతా బతికేవారు. మోడీ కరోనాను వదిలేసి.. బెంగాల్ ఎన్నికల మీద దృష్టి పెట్టారు. అందువల్లే చాలామంది కరోనాకు బలయ్యారు. వైరస్ నిరంతరం పరివర్తనం చెందుతోంది. థర్డ్ వేవ్‌ను ఎదర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటే.. రెండో వేవ్‌లో తప్పు జరిగినట్లే. అందుకే ఇప్పుడు తొందర పడుతున్నారు. మూడో వేవ్‌ను అడ్డుకోవాలంటే.. వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలి. ఆక్సిజన్, మందులు,  వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్ల వంటి వాటిని సమకూర్చుకోవాలి. మహమ్మారి మరియు లాక్డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన వారికి ప్రత్యక్ష నగదు బదిలీ చాలా అవసరం. కోవిడ్ ఒక ఆర్ధిక మరియు సామాజిక వ్యాధి. దీనివల్ల నష్టపోయిన వారికి సాయం చేసేందుకు మేం NYAY కాన్సెప్ట్‌ను ప్రతిపాదించాం. అది మీకు నచ్చకపోతే.. దాని పేరు మార్చుకోవచ్చు. ఏదేమైనా.. పేద ప్రజలకు సాయమందడం మా లక్ష్యం’ అని రాహూల్ గాంధీ అన్నారు.