అడవుల సంరక్షణతోనే గ్రామీణ ఆర్థికాభివృద్ధి : ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి

అడవుల సంరక్షణతోనే గ్రామీణ ఆర్థికాభివృద్ధి : ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి


ఖమ్మం టౌన్, వెలుగు : అడవుల సంరక్షణను గ్రామీణ ఆర్థికాభివృద్ధితో అనుసంధానిస్తూ.. స్థిరమైన గ్రీన్ జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమమే ‘తెలంగాణ వన్ జీవన్‌‌ ధార -ఖమ్మం’ అని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో ఖమ్మం జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘తెలంగాణ వన్ జీవన్‌‌ ధార -ఖమ్మం (టీవీజే -ఖమ్మం)’ పైలట్ ప్రాజెక్టును అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అడవులను రక్షిస్తేనే స్థానిక ప్రజలకు స్థిరమైన ఉపాధి లభిస్తుందన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ –2047 లక్ష్యానికి అనుగుణంగా వన సంరక్షణ సమితులను (వీఎస్ఎస్) స్వయం ఆధారిత గ్రీన్ ఎంటర్‌‌ ప్రైజ్‌‌లుగా తీర్చిదిద్దే ఈ వినూత్న ప్రయత్నాన్ని ఎంపీ ప్రశంసించారు. 

జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ జిల్లాలో ఆరణ్య సంరక్షణ ఫలితాలు, సముదాయ ఆదాయాలనుఅనుసంధానిస్తూ స్థిరమైన జీవనోపాధి కల్పించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో సన్యాసయ్య, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి పుల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, ఎఫ్​డీవో మంజుల, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

సర్వే ప్రకారమే టికెట్ల కేటాయింపు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సర్వే ప్రకారమే గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి క్యాంప్​ ఆఫీస్​లో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్​ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో ఎలాంటి విభేదాలకు తావు లేకుండా ప్రతిఒక్కరూ సమష్టిగా పనిచేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు కృషి చేయాలన్నారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సీపీఐ, సీపీఎంలతో పొత్తులుంటే సీట్ల సర్దుబాటు ఉంటుందన్నారు. కొందరు త్యాగం చేయాల్సి ఉంటుందని చెప్పారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కృషి చేయాలని కోరారు.