రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పశ్చిమ బెంగాల్ ఎంపీ రంజన్ చౌదరి క్షమాపణ చెప్పాల్సిందేనని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి డిమాండ్ చేశారు. వెస్ట్ బెంగాల్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. ఎల్బీ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఎంపీ చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ...సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ విచారణ చేస్తున్న సమయంలో రంజన్ చౌదరి పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయ్యారని తెలిపారు. అనంతరం ధర్నాలో కూర్చొని దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతిపై అలాంటి కామెంట్ చేయడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రపతి కాదు హిందుస్థాన్ రాష్ట్రపత్ని అనడం దారుణమన్నారు. వెంటనే అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పాలని సామ రంగారెడ్డి కోరారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు రాష్ట్ర ఓబీసీ నాయకులు చింతల సురేందర్ యాదవ్, మహిళ నాయకులు పాల్గొన్నారు.
