నిగ్గు తేల్చిన నిజాలు: దేవుడి మాన్యాల్లో కేటీఆర్ భూములు

నిగ్గు తేల్చిన నిజాలు: దేవుడి మాన్యాల్లో కేటీఆర్ భూములు

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కుటుంబీకులు భూకబ్జాలకు పాల్పడ్డారని దీనిపై సంపూర్ణ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. తన నియోజకవర్గమైన శామీర్ పేట మండలంలోని, దేవరయాంజల్ భూముల ఆక్రమణలపై సోమవారం ప్రెస్ మీట్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. నమస్తే తెలంగాణ పేపర్ ఎండీకి కూడా ఇక్కడ భూములు ఉన్నాయన్నారు. రామాలయం భూముల్లో కేసీఆర్, కేటీఆర్ కు భూములున్నాయని తెలిపారు. దేవరయాంజాల్ భూముల్లో సేల్ డీడ్ కేటీఆర్ పేరు మీద ఉందని.. దేవుడి మాన్యాల్లో టీఆర్ఎస్ లీడర్లకు భూములు ఉన్నాయన్నారు.  సర్వే నెంబర్ 658 మంత్రి మల్లారెడ్డి ఆక్రమించుకున్నారని.. 7 ఎకరాల్లో మంత్రి మల్లారెడ్డి ఫాంహోజ్ కట్టుకున్నారని చెప్పారు. రామాలయం గుడి మాన్యం కింద ఉన్న 1553 ఎకరాల్లో కేటీఆర్, దామోదర్ రావుకు భూమి ఉందన్నారు. సర్వే నెంబర్ 437లో ఉన్న అక్రమ నిర్మాణాల్లో కేసీఆర్ కు వాటా ఉందని..కేటీఆర్ కు భూమి అమ్మిందెవరని ప్రశ్నించారు.

ఈ అక్రమాలను గోల్ మాల్ చేయడానికే ధరణి వెబ్ సైట్ సృష్టించారన్నారు. ధరణిలో ఎవరి భూమి ఎవరికి అమ్మారనే వివరాలే ఉండవన్నారు. 1925 నుంచి 2021 వరకు దేవరయంజల్ భూముల్లోని ప్రతి సర్వే నెంబర్ లావాదేవీలపై క్లారిటీ కావాలన్నారు.  మీ నిజాయితీని ప్రజల ముందు పెట్టాలంటే దమ్ముంటే కేసీఆర్ గారూ మీరు దేవరయంజల్ భూముల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. నీతికి నిజాయితికి నిదర్శనం సీఎం కేసీఆర్ అని ఆయన అనుచరులు చాలా సందర్భాల్లో చెప్పుకోవడం కామనే కదా అన్నారు. ఏ విధంగా అయితే ఆగమేఘాల మీద ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి తొలగించారో.. కేటీఆర్, మంత్రి మల్లారెడ్డిపై కూడా విచారణ జరిపించాలన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. మల్లారెడ్డి, కేటీఆర్ పోటీపడి ఫాంహోజ్ లు కట్టుకున్నారని.. దేవుడి పేరు మీదున్న భూములపై బ్యాంకుల్లో వందల కోట్ల రూపాయలు లోన్లు తీసుకున్నారని వివరించారు. వందల ఎకరాలు దేవుడి మాన్యాలను ఆక్రమించుకుని.. ఇప్పుడు ఏ రకంగా ఈటల విషయంలో నీతి నిజాయితీగా మాట్లాడుతున్నారన్నారు. ఈ విషయంపై సీబీఐకి ఫిర్యాదు చేస్తానని.. అవసరమైతే ప్రధాని మోడీని కలుస్తానని తెలిపారు ఎంపీ రేవంత్ రెడ్డి.