ఎకరానికి రూ.20వేల న‌ష్ట పరిహారం చెల్లించాలి

ఎకరానికి రూ.20వేల న‌ష్ట పరిహారం చెల్లించాలి
  • వ‌ర్షాల వ‌ల్ల రైతుల‌కు జ‌రిగిన న‌ష్టాన్ని ప్ర‌భుత్వ‌మే భ‌రించాలి
  • ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్‌కు కొడుకు కేటీఆర్ పై ఉన్న ప్రేమ రైతులపై లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. బుధ‌వారం అకాల వర్షాలు, పంట నష్టం- రైతుల కష్టం గురించి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు రేవంత్. లేఖలో.. వర్షం వల్ల రైతుల‌కు జరిగిన నష్టాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించాలని, తక్షణమే వ్యవసాయ శాఖ మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించి త్వరితగతిన పంట నష్టాన్ని అంచనా వెయ్యాలని పేర్కొన్నారు.

నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20వేల పరిహారం చెల్లించాలని చెప్పారు. పంట నష్టానికి వెంటనే తక్షణ సాయం కింద రూ. వెయ్యి కోట్లు విడుదల చెయ్యాల‌న్నారు. పంట నష్టం జరిగిన రైతులు మళ్ళీ పంటలు వేసుకోవడానికి విత్తనాలు అందుబాటులోకి తేవాలని, రాష్ట్రంలో ఉన్న‌ ఎరువుల కొరతను వెంటనే తీర్చాల‌ని చెప్పారు.

రాష్ట్రంలో ఫసల్ భీమా పథకాన్ని అమలు చేయాల‌ని డిమాండ్ చేశారు రేవంత్ . లేదా మ‌రో కొత్త పథకాన్ని అమలు చేయాలన్నారు. వర్షం కారణంగా అస్తవ్యస్తంగా మారిన భూములను బాగు చేసుకోవడానికి ప్ర‌భుత్వం ఎకరానికి 5వేలు ఆర్థిక సాయం చేయాల‌ని చెప్పారు.