ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో..ఆప్ ఎంపీ అరెస్టు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో..ఆప్ ఎంపీ అరెస్టు
  • నార్త్ అవెన్యూలోని ఆయన నివాసంలో రెయిడ్స్
  • ఇప్పటికి వెయ్యి సోదాలు.. పైసా కూడా దొరకలే: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరు అరెస్టు అయ్యారు. ఆమ్‌‌ ఆద్మీ పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌‌ను ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అదుపులోకి తీసుకుంది. మనీ ల్యాండరింగ్‌‌ కేసుకు సంబంధించి.. నార్త్ అవెన్యూలోని సంజయ్ సింగ్ నివాసంలో బుధవారం ఉదయం ఈడీ రెయిడ్స్ మొదలయ్యాయి. గంటలతరబడి సోదాల తర్వాత మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద ఆఫీసర్లు ఆయనను అరెస్టు చేశారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ కోసం పర్మిషన్ తీసుకునేందుకు గురువారం మధ్యాహ్నం సంజయ్​ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

దినేశ్ అరోరా వాంగ్మూలంతో..

ఈ కేసులో అప్రూవర్‌‌‌‌గా మారిన దినేశ్ అరోరా ఇచ్చిన సమాచారంతోనే సంజయ్ సింగ్ నివాసం లో ఈడీ ఈ రెయిడ్స్ చేపట్టింది. ఎక్సైజ్‌‌ మంత్రిగా ఉన్న సిసోడియాకు సంజయ్ సింగ్‌‌ తనను పరిచయం చేశాడని అరోరా వెల్లడించాడు. తన రెస్టారెంట్ ‘అన్‌‌ప్లగ్డ్ కోర్ట్‌‌ యార్డ్‌‌’లో జరిగిన పార్టీ సందర్భంగా సంజయ్ సింగ్‌‌ను కలిశానని దినేశ్‌‌ అరోరా చెప్పినట్లు వివరించింది. ‘రెస్టారెంట్​ ఓనర్ల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలక్షన్ ఫండ్​ సమకూర్చాలని 2020లో సంజయ్ సింగ్​ అడిగారు. దీంతో పార్టీ ఫండ్​కు రూ.82 లక్షల చెక్కును అందించా. అమిత్ అరోరా (మరో నిందితుడు) తన మద్యం దుకాణాన్ని ఓఖ్లా నుంచి పితంపురకు మార్చేందుకు సాయం అడిగాడు. విషయాన్ని సంజయ్ సింగ్​ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సిసోడియాకు చెప్పడంతో.. అమిత్​కు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ మార్పులు చేసింది’’ అని దినేశ్​ చెప్పినట్లు చార్జిషీట్‌‌లో ఈడీ పేర్కొంది.

మరింత మంది అరెస్టయితరు: కేజ్రీవాల్

అదానీ గ్రూప్ అంశంపై పార్లమెంటులో ప్రశ్నించినందుకు సంజయ్ సింగ్‌‌ను ఈడీ టార్గెట్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. వెయ్యికి పైగా రెయిడ్స్ చేసినా.. ఒక్క పైసా అక్రమ సంపాదనను గుర్తించలేకపోయారని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల నాటికి మరింత మంది ప్రతిపక్ష నేతలు అరెస్టయ్యే అవకాశం ఉందని ట్వీట్ చేశారు. కాగా, కేజ్రీవాల్ విమర్శలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. లిక్కర్ స్కామ్‌‌లో కేజ్రీవాలే కింగ్‌‌పిన్ అని ఆరోపించింది. ఆయన చేతికి సంకెళ్లు పడే రోజు ఎంతో దూరం లేదని హెచ్చరించింది.

అధికారులకు వెల్కం చెబుతూ ఇంటి ముందు ఫ్లెక్సీ

సంజయ్ సింగ్​ నివాసం ముందు ‘ఈడీ అధికారులకు స్వాగతం’ అంటూ ఫ్లెక్సీ కనిపించడంతో అధికారులు నివ్వెరపోయారు. ఈ ఫ్లెక్సీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. కాగా, ఆధారాలు లేకున్నా అధికారులు తనను అరెస్టు చేశారని ఎంపీ ఆరోపించారు. అవినీతిని ప్రశ్నించే విషయంలో ఎన్నటికీ తలవంచేది లేదని ప్రి రికార్డెడ్ వీడియోలో సంజయ్ స్పష్టం చేశారు.