- పెండింగ్‌లో ఉన్న రైల్వే నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి: ఎంపీ వంశీకృష్ణ
పెద్దపల్లి, వెలుగు: తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో పెద్దపల్లి మీదుగా అదనపు రైళ్లు నడపాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. పార్లమెంట్ సభ్యుల వేతనాలు, పని పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ సమావేశం శనివారం కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. ఈ సమావేశానికి వంశీకృష్ణ హాజరై, మాట్లాడారు. మేడారానికి పెద్దపల్లి మీదుగా అదనపు రైళ్లు నడపడంతో పాటు రైల్వేకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులు, ఇతర సమస్యలను త్వరగా పరిష్కరించేలా చూడాలని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, పార్లమెంట్ సభ్యుల జీతభత్యాల వ్యవస్థను పారదర్శకంగా రూపొందించాలని కోరారు. ప్రజాప్రతినిధులపై రోజురోజుకు పెరుగుతున్న బాధ్యతలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం వంటి కీలక అంశాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల గొంతుకగా పార్లమెంట్‌లో నిరంతరం పనిచేస్తున్న ఎంపీల వేతనాలు, -భత్యాల వ్యవస్థను మరింత సమర్థవంతంగా రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ వంశీకృష్ణ సూచనలపై కమిటీ సభ్యులు సానుకూలంగా స్పందించారు.
