పెగడపల్లి,వెలుగు: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల చనిపోయిన, రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందిన కుటుంబాలను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదివారం పరామర్శించారు. పెగడపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చాట్ల విజయభాస్కర్ కొడుకు విక్రమ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.
చికిత్స పొంది రెస్ట్ తీసుకుంటున్న అతడిని ఆదివారం ఎంపీ పరామర్శించారు. అనంతరం నందగిరి గ్రామంలో వారం కింద హార్వెస్టర్ బావిలో పడి చనిపోయిన డ్రైవర్ పాలకల్లు మధు కుటుంబాన్ని, మద్దులపల్లి గ్రామానికి చెందిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డి తల్లిదండ్రులు సురకంటి చుక్కారెడ్డి– శంకరమ్మ ఒకే రోజు చనిపోగా వారి కుటుంబాన్ని, అదే గ్రామంలోని ఆత్మహత్య చేసుకున్న చింతల శ్రీనివాస్ కుటుంబాన్ని ఎంపీ పరామర్శించారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు తమ వంతుగా ఆర్థిక సాయం అందజేశారు.
తర్వాత మండల కేంద్రంలోని కాంగ్రెస్ ఆఫీస్‌లో మండల అభివృద్ధి కోసం ఎంపీ ల్యాండ్స్ నిధులు కేటాయించాలని వంశీకృష్ణకు ఎంపీపీ వినతి పత్రం ఇచ్చారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ కాంపౌండ్ నిర్మాణానికి, గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఎంపీకి వినతి పత్రం అందజేశారు. ఎంపీ వెంట వివిధ గ్రామాల సర్పంచులు ఓరుగల అరుణ, ధనాల రజిత, వెల్మ బలరాం రెడ్డి, సంధి రాజమణి, జీల రాకేశ్, రమేశ్ నాయక్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఓరుగల శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ సత్తిరెడ్డి, డైరెక్టర్లు, లీడర్లు కాడే సూర్యనారాయణ, వంశీ రావు, రాజకుమార్ పాల్గొన్నారు.

