రాజకీయాలు మాని.. రైతుల సమస్యలపై ఫోకస్ పెట్టండి..పెద్దపల్లి కలెక్టర్ పై ఎంపీ వంశీకృష్ణ ఫైర్

రాజకీయాలు మాని.. రైతుల సమస్యలపై ఫోకస్ పెట్టండి..పెద్దపల్లి కలెక్టర్ పై ఎంపీ వంశీకృష్ణ ఫైర్
  •  కావాలనే కలెక్టర్​ సమస్యలు సృష్టిస్తున్నరు 
  • ఆయన ఎవరి ఆదేశాల మేరకు నడుస్తున్నారో చెప్పాలి
  • మంచిర్యాల నుంచి వచ్చిన ధాన్యం తీసుకోవడం లేదని ఆగ్రహం

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి కలెక్టర్ రాజకీయాలు చేయడం మాని రైతుల సమస్యలు పరిష్కరించడంపై ఫోకస్ పెట్టాలని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. రైస్ మిల్లులు ఎక్కువగా ఉన్న పెద్దపల్లి జిల్లాలో ధాన్యం లారీలను అన్ లోడ్ చేయకపోవడం వల్ల మంచిర్యాల జిల్లాలో కొనుగోళ్లపై ప్రభావం పడుతోందని, కలెక్టర్ కావాలని సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎవరి ఆదేశాల మేరకు ఇలా నడుచుకుంటున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీ వంశీకృష్ణ బుధవారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్​లో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు.

మార్కెట్​కమిటీ అధికారులతో ఫోన్​లో మాట్లాడి కొనుగోళ్లలో వేగం పెంచాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలు చెప్పేందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలెక్టర్​స్పందించడం లేదని.. ఎంపీ ఫోన్ ఎత్తలేని కలెక్టర్ సామాన్యుల సమస్యలపై ఎలా స్పందిస్తారని నిలదీశారు. పెద్దపల్లి జిల్లాలో 6 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం మిల్లింగ్ సామర్థ్యం ఉందని, గతంలో మంచిర్యాల నుంచి దాదాపు 60 వేల మెట్రిక్​ టన్నుల వడ్లు పెద్దపల్లి గోడౌన్స్​కు వచ్చేవని అన్నారు. ప్రస్తుతం మంచిర్యాలకు సంబంధించిన ధాన్యాన్ని ఇక్కడ తీసుకోవడం లేదన్నారు.

పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న రైతులు అందరి పక్షాన తాను డిమాండ్​ చేస్తున్నానని.. ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు విషయంలో వివక్ష చూపొద్దన్నారు.  జిల్లాలో ఇప్పటివరకు 1.4‌‌‌‌‌‌‌‌0 లక్షల మెట్రిక్​ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని, మంచిర్యాల జిల్లాలో రెండున్నర లక్షల టన్నుల ధాన్యానికి గాను కేవలం 60 వేల టన్నులు మాత్రమే మిల్లింగ్ కు తరలించారని చెప్పారు. మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా దళిత రైతులు ఉన్నందు వల్లనే కలెక్టర్ వారికి సమస్యలు సృష్టిస్తున్నారని చెప్పారు. ‘రైతుల గోస అధికారులకు పట్టదా.. వారిని సంపుతారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సక్రమంగా పనిచేయని అధికారుల వెంట పడుతానని హెచ్చరించారు. కలెక్టర్​తీరుపై మరోసారి చీఫ్ సెక్రటరీకి లేఖ రాస్తానన్నారు. 

కొత్త మైన్స్ కోసం ప్రయత్నం 

పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో సింగరేణి కొత్త మైన్స్ ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నట్టు ఎంపీ తెలిపారు. కొత్త మైన్​ద్వారా ఉత్పత్తి పెరగడంతో పాటు కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు. గతంలో కాకా వెంకటస్వామి, ప్రస్తుత కార్మికశాఖ మంత్రి, ఆనాటి ఎంపీ వివేక్​ వెంకటస్వామి ఆర్​ఎఫ్​సీఎల్ రుణాన్ని మాఫీ చేయించి పునఃప్రారంభం అయ్యేలా చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆర్​ఎఫ్​సీఎల్​లో పూర్తి స్థాయిలో ఎరువుల ఉత్పత్తి జరగడంలేదన్నారు.

ఆర్​ఎఫ్​సీఎల్​నుంచి తెలంగాణకు కేవలం 20 శాతం ఎరువులు మాత్రమే ఇస్తున్నారన్నారు. బీజేపీ భేటీ బచావో నినాదంగానే మిగిలిందని, రేప్ కేసుల్లో ఉన్నవారికి టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. బండి సంజయ్​ కొడుకు భగీరథ్​విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్​వేసిందని.. విచారణలో ఎవరు దోషులని తేలినా శిక్ష తప్పదన్నారు. ఈ సమావేశంలో నాయకులు సయ్యద్​ సజ్జాద్, రఘునాథ్​రెడ్డి, బండారి సునీల్, అడ్డగుంట శ్రీనివాస్, విజయ్ కుమార్, కైలాసం, ఐలయ్యయాదవ్​, మహేశ్​ తదితరులు పాల్గొన్నారు.