ఎన్‌‌హెచ్ 63 పనుల్లో సమస్యలు పరిష్కరించండి

ఎన్‌‌హెచ్ 63 పనుల్లో సమస్యలు పరిష్కరించండి
  • కేంద్రమంత్రి గడ్కరీకి ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి 
  • అటవీ అనుమతులు ఇప్పించండి  
  • ఫండ్​ రిలీజ్​ చేయాలని వినతి 
  • సానుకూలంగా స్పందించిన గడ్కరీ

ఆసిఫాబాద్, వెలుగు: నిజామాబాద్​ నుంచి జగ్దల్‌‌పూర్​ వరకు చేపట్టిన నేషనల్ హైవే 63 పనుల్లో పలుచోట్ల సమస్యలు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. సోమవారం కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కాగజ్‌‌నగర్ ఎక్స్‌‌ రోడ్ వద్ద నిర్వహించిన నేషనల్ హైవే 63 ప్రారంభోత్సవానికి వచ్చినగడ్కరీని కలిసి వంశీకృష్ణ వినతిపత్రం అందజేశారు. ‘‘మంచిర్యాల జిల్లాలో గోదావరి నదిపై 210 కిలోమీటర్​వద్ద బతుకమ్మ వాగు ఏరియాలో నిర్మించిన బ్రిడ్జి అప్రోచ్​2022లో కురిసిన భారీ వర్షానికి  దెబ్బతిన్నది.

దీంతో మంచిర్యాల– జగ్దల్‌‌పూర్ మధ్య రవాణాకు అంతరాయం ఏర్పడింది. తాత్కాలిక చర్యలు చేపట్టినప్పటికీ ఇటీవల చిన్న వర్షాలకు అప్రోచ్​మళ్లీ కొట్టుకుపోయింది. 2024–25లో అడిషనల్​వెంట్​కోసం రూ.9 కోట్లు మంజూరు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ 3 అడిషనల్​వెంట్లు అవసరమున్నాయి. ఇందుకోసం రూ.20 కోట్లు మంజూరు చేయాలి” అని వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు. బ్రిడ్జి వద్ద ఇసుక మైనింగ్ ద్వారా ఏర్పడిన ఖాళీని పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 

పనులు త్వరితగతిన చేయండి.. 

అటవీ అనుమతుల్లేక కొన్ని చోట్ల పనులు నిలిచిపోయాయని గడ్కరీ దృష్టికి వంశీకృష్ణ తీసుకెళ్లారు. ‘‘184 కిలోమీటర్​నుంచి 190 వరకు, అలాగే 194 కిలోమీటర్​నుంచి 198 కిలోమీటర్ మధ్య సుమారు 10 కిలోమీటర్ల మేర పనులు అటవీ అనుమతుల్లేక నిలిచిపోయాయి. ఈ ఫారెస్ట్ పర్మిషన్లు వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవాలి. అలాగే తెలంగాణ-–మహారాష్ట్ర మధ్య అనుసంధానంగా ఉన్న ఎన్‌‌హెచ్ 63లో అసంపూర్తి పనుల కారణంగా ప్రజల రాకపోకలు, రవాణాకు తీవ్ర ఇబ్బదులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఇసుక రవాణా వాహనాలతో పాటు ప్రముఖ శైవ క్షేత్రం కాళేశ్వర్వానికి  భక్తుల రాకపోకలు పెరిగాయి. తరుచూ ప్రమాదాలు జరుగుతున్నుందున రోడ్డు వెడల్పు పనులు వెంటనే చేయాలి. ఇందుకోసం పెరిగిన అంచనాల ప్రకారం రూ.130 కోట్లు వెంటనే మంజూరు చేయాలి” అని కోరారు. కాగా, ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తికి కేంద్రమంత్రి గడ్కరీ  సానుకూలంగా స్పందించారు.