V6 News

జనాభా లెక్కలు తేలాలి.. దళితులు ఎదగాలి: ఎంపీ వంశీకృష్ణ

జనాభా లెక్కలు తేలాలి.. దళితులు ఎదగాలి: ఎంపీ వంశీకృష్ణ

సమాజంలో దళితుల జనాభా గణాంకాలపై స్పష్టత లేకపోవడం వల్లే వారి అభివృద్ధి కుంటుపడుతోందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ .హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో మహనీయుల జయంతి ఉత్సవాలు, దళిత రత్న అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న  ఆయన దళిత సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో వెంటనే కొత్త జనాభా లెక్కలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఎంపీ స్పష్టం చేశారు. 18 శాతం ఉన్న దళిత జనాభాకు అనుగుణంగా అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని, ఇదే విషయాన్ని మంత్రి వివేక్ ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని వంశీకృష్ణ గుర్తు చేశారు.దళితుల సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని.. ఏ సమయంలో తన తలుపు తట్టినా అండగా నిలబడతానని ఆయన భరోసా ఇచ్చారు. సమాజంలో దళితులు ఉన్నత విద్యావంతులైతేనే అభివృద్ధి బాటలో నడుస్తారని ఆయన పిలుపునిచ్చారు.

రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల వల్లే తాను నేడు పెద్దపల్లి ఎంపీగా మీ పక్షాన నిలబడగలిగానని వంశీకృష్ణ  తెలిపారు. అన్ని రంగాల్లో రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకుని ఎదగాలని విద్యార్థులకు సూచించారు. వెనుకబడిన వర్గాల కోసం జ్యోతిరావు పూలే కుటుంబం చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. దివంగత నేత కాకా వెంకటస్వామి ఆలోచనలతో హైదరాబాద్‌లో అంబేద్కర్ కాలేజీని ఏర్పాటు చేశామని, అక్కడ దళితులకు 80 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని ఎంపీ వంశీకృష్ణ వెల్లడించారు.