పోలీసు నిర్బంధంతో మా ఉద్యమాన్ని అణచలేరు : ఎంపీ వంశీకృష్ణ

పోలీసు నిర్బంధంతో  మా ఉద్యమాన్ని అణచలేరు :  ఎంపీ వంశీకృష్ణ
  •      ప్రజల ఓటు హక్కు కోసం చివరి శ్వాస వరకు పోరాటం
  •     బీజేపీకి ధైర్యం ఉంటే మళ్లీ ఎన్నికలకు రావాలి
  •     ఎంపీ వంశీకృష్ణ సవాల్ 

న్యూఢిల్లీ: పోలీసు బలంతో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణచలేరని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ధ్వజమెత్తారు. ప్రజల ఓటు హక్కు కోసం చివరి శ్వాస వరకు తమ పోరాటం కొనసాగుతుంని తేల్చిచెప్పారు. చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్ ​జ్ఞానేశ్​కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్​చేస్తూ.. బుధవారం ఢిల్లీలో పోలీసులను మోహరించి ఇండియా కూటమి ఎంపీలను అడ్డుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేయడం ప్రజాస్వామ్యం కాదని మండిపడ్డారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తే పోలీసులతో అడ్డుకోవడం, నిర్బంధించడం, ఉద్యమాలను ఆపాలని ప్రయత్నించడం సరికాదన్నారు.

అధికారం శాశ్వతం కాదని.. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రజల ఓటు హక్కే శాశ్వతమని ఆయన స్పష్టం చేశారు. ‘మమ్మల్ని అడ్డుకోవచ్చు. నిర్బంధించవచ్చు. కానీ, ప్రజల గొంతును అడ్డుకోలేరు. ప్రజాస్వామ్యం కోసం మా పోరాటం ఢిల్లీలోనే ఆగదు. దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రజల ఓటు హక్కును బలహీనపరిచే ఏ చర్యనైనా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు పూర్తి విశ్వాసం కలిగే వరకు మా పోరాటం కొనసాగిస్తాం’ అని ఎంపీ వంశీకృష్ణ తేల్చిచెప్పారు.

ధైర్యం ఉంటే మళ్లీ ప్రజల ముందుకు రండి

కేంద్రంలోని మోదీ సర్కారుకు నిజంగా  ధైర్యం ఉంటే, బీజేపీపై ప్రలజకు నమ్మకం ఉందని భావిస్తే.. మళ్లీ ప్రజల్లోకి వచ్చి స్వేచ్ఛాయుతంగా ఎన్నికలను ఎదుర్కోవాలని ఎంపీ వంశీకృష్ణ డిమాండ్​చేశారు. అధికార బలగాలను అడ్డుపెట్టుకోకుండా ప్రజల ముందుకు రావాలని.. ఫెయిర్ అండ్ స్క్వేర్‌‌‌‌గా ఎన్నికలను ఎదుర్కోవాలని సవాల్​విసరారు. ప్రజల తీర్పును స్వేచ్ఛగా అంగీకరించే ధైర్యం ఉండాలన్నారు. ఓటర్ల హక్కులు, ఎన్నికల పారదర్శకతపై ప్రజల్లో ఉన్న అనుమానాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని వంశీకృష్ణ అన్నారు.   
 
ఎంపీ రఘురాం రెడ్డిని లాఠీలతో కొట్టారు
రాహుల్​తో కలిసి ఆందోళన చేస్తున్న ఇండియా కూటమి నేతలను అరెస్ట్​ చేయడంపై ఎంపీ వంశీకృష్ణ ఫైర్​అయ్యారు. రాహుల్​ గాంధీని అరెస్ట్​చేసి తీసుకెళ్తున్న వెహికల్​ ముందు ధర్నా చేస్తుంటే తనతో పాటు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డిని పోలీసులు ఈడ్చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా ఎంపీ రఘురాం రెడ్డిని లాఠీలతో కొట్టారని తెలిపారు. పోలీసుల దాడిలో రఘురాం రెడ్డికి తగిలిన గాయాలను ఎంపీ వంశీకృష్ణ వీడియోలో చూపించారు. తామేమైనా తీవ్రవాదులమా అంటూ ఎంపీ ప్రశ్నించారు. హోంమంత్రి అమిత్ షా, అతని గూండాలు.. పిల్లల మీద, పాలిటీషియన్స్ మీద, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీద వారి ప్రతాపం చూపించడం సిగ్గుచేటన్నారు. ధైర్యముంటే ప్రజల ముందుకు వచ్చి కొట్లాడాలన్నారు. అంతేగానీ, పోలీసులతో కొట్టించి, తమ గళాన్ని అణచలేరని హెచ్చరించారు.