మంచిర్యాల జిల్లా కోటపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ. సోమవారం ( జూన్ 1 ) జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కేటీఆర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఎంపీ వంశీకృష్ణ. కేటీఆర్ రాష్ట్ర యువతను నాశనం చేయాలని చూస్తున్నాడని.. యువతపై ఎన్ని కేసులు ఉంటే అంత మంచిది అని యువతను రెచ్చగొట్టి వాళ్ల భవిష్యత్తుతో ఆటలాడుతున్నాడని మండిపడ్డారు. కేటీఆర్ మాత్రం విదేశాలకు తిరుగుతూ ఇక్కడ పదవులు అనుభవించాలి కానీ కేసులు మాత్రం కార్యకర్తలు జైలుకు వెళ్లాలి అన్నట్లు ఉందని అన్నారు.
సర్ (SIR) ప్రక్రియతో దక్షిణాదిన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని.. సర్ (SIR) ప్రక్రియతో మొన్న జరిగిన ఎన్నికల్లో బెంగాల్లో, తమిళనాడు, అస్సాంలో సిట్టింగ్ సీఎంలు ఓడిపోయారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక ఓట్లను తొలగించి గద్దెనెక్కాలనే ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ బీఎల్వోలు ఇంటింటికి తిరిగి ఓటర్ జాబితాను సరి చూసుకోవాలని అన్నారు. ఒక్క ఓటును కూడా తొలగించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనించేలా పని చేస్తుందని అన్నారు. రాష్ట్ర యువత ఎవరూ బీఆర్ఎస్ మాటలు నమ్మి వారి అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు ఎంపీ వంశీకృష్ణ. బీజేపీ ప్రభుత్వం అంటేనే స్కాం ల ప్రభుత్వం అయిపోయిందని.. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారి పైన ఈడీ రైడ్లు చేసి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతుందని మండిపడ్డారు. మళ్ళీ వారు 6 నెలలకు బీజేపీలో చేరితే వారికి క్లీన్ చిట్ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారని అన్నారు.
ఇటీవలే కేంద్ర విద్యాశాఖ మంత్రి నీట్ పేపర్ లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్తు తో ఆడుకున్నాడని..విద్యార్థుల భవిష్యత్తు గురించి కొంచెం కూడా ఆలోచన లేకుండా పేపర్ లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తున్నారని అన్నారు.ఇలాంటి స్కాం లకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని రాబోయే కాలంలో గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఎంపీ వంశీకృష్ణ.
