వనపర్తి జిల్లాలో పీఎం ఆవాస్ యోజన సర్వేపై నిర్లక్ష్యం..ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులపై కలెక్టర్ ఆగ్రహం

వనపర్తి జిల్లాలో పీఎం ఆవాస్ యోజన సర్వేపై నిర్లక్ష్యం..ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులపై కలెక్టర్ ఆగ్రహం

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్  యోజన సర్వేపై ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం చేస్తున్నారు. 33శాతం సర్వే మాత్రమే పూర్తి కావడంతో కలెక్టర్  ఆదర్శ్  సురభి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎం ఆవాస్​ యోజన సర్వేపై మంగళవారం కలెక్టరేట్  నుంచి ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. 

జిల్లాలోని ఏదుల, పాన్​గల్, పెబ్బేరు మండలాలు సర్వేలో చివరి స్థానంలో ఉన్నాయని చెప్పారు. ఆయా ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలపై సీరియస్​ అయ్యారు. సర్వే చేయడంలో నిర్లక్ష్యం వహించిన సెక్రటరీలకు షోకాజ్  నోటీసులు జారీ చేయాలని డీపీవోను ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబాల నుంచి ఎల్–1 కేటగిరిలో ఉన్న వారి వివరాలను  ప్రధానమంత్రి ఆవాస్  యోజన సర్వేలో భాగంగా ఆన్​లైన్  చేయాల్సి ఉందన్నారు. 

వనపర్తి జిల్లాలో ఎల్–1 కేటగిరీలో 39,643 కుటుంబాలు ఉన్నాయని, ఇందులో 27,205 కుటుంబాల వివరాలు అప్​లోడ్  చేయాల్సి ఉండగా, 33 శాతం మాత్రమే పూర్తి కావడంపై కలెక్టర్  అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులోగా పీఎం ఆవాస్  యోజన సర్వే కంప్లీట్​ చేసి జియో ట్యాగింగ్  చేయాలని ఆదేశించారు. ప్రతి విలేజ్​ సెక్రటరీ రోజుకు 30 ఇండ్లను సందర్శించి సర్వే చేసి జియో ట్యాగింగ్  కంప్లీట్​ చేయాలన్నారు. 

నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల ప్రత్యేక అధికారులు సర్వేపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గడువులోగా సర్వే పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. రోజువారీగా సర్వే రిపోర్టు పంపించాలన్నారు. అడిషనల్​ కలెక్టర్ యాదయ్య, డీఆర్డీవో ఉమా దేవి,  హౌసింగ్  పీడీ విఠోబా పాల్గొన్నారు.

బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి..

జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్  ఆదర్శ్  సురభి తెలిపారు. బుధవారం కలెక్టరేట్​లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలను ఆయన ప్రారంభించారు. ఐడీవోసీలో ప్రతి రోజు మహిళా ఉద్యోగులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ నెల 30న పాలిటెక్నిక్  కాలేజీ గ్రౌండ్​లో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా మహిళలు స్వచ్ఛందంగా వేడుకల్లో పాల్గొనాలని కోరారు. డీఏవో ఆంజనేయులు గౌడ్, డీపీఆర్వో సీతారాం, డీడబ్ల్యూవో సుధారాణి పాల్గొన్నారు. 

ఫిష్​ ప్రాసెసింగ్​ సెంటర్​ కోసం స్థల పరిశీలన

వనపర్తి జిల్లాలో అంతర్జాతీయ మత్స్య రవాణా, ప్రాసెసింగ్  యూనిట్​ ఏర్పాటు కోసం కలెక్టర్  ఆదర్శ్  సురభి స్థలాన్ని పరిశీలించారు. పెబ్బేరు మండలం వైశాకాపూర్  గ్రామ శివారులోని సర్వే నంబర్​ 163, 162, 143లోని పదెకరాల ప్రభుత్వ స్థలాన్ని తహసీల్దార్  మురళీతో కలిసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్  బంక్​ ఏర్పాటు కోసం మండలంలోని తోమాలపల్లి శివారులో హై వే పక్కన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మల్లికార్జున ఫర్టిలైజర్  షాపును పరిశీలించి, రైతులకు యూరియాను అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.