బడుగులకు అవకాశాలు కల్పించిన వ్యక్తి అంబేద్కర్‌ : ఎంపీలు

బడుగులకు అవకాశాలు కల్పించిన వ్యక్తి అంబేద్కర్‌ : ఎంపీలు
  • కరెన్సీపై ఆయన ఫొటో ముద్రించాలి: ఎంపీలు
  • అంబేద్కర్ ఫొటో సాధన సమితి ఆధ్వర్యంలో జంతర్ మంతర్‌ వద్ద ధర్నా

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం వెంటనే కరెన్సీపై అంబేద్కర్‌ ఫొటోను ముద్రించాలని పలువురు ఎంపీలు డిమాండ్‌ చేశారు. బడుగు, బలహీన వర్గాలు ఉన్నత అవకాశాలు పొందేలా రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్‌ గొప్పతనాన్ని చాటేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. బుధవారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో అంబేద్కర్‌ ఫొటో సాధన సమితి అధ్యక్షుడు జేరిపోతుల పరుశురాం, జాతీయ సలహాదారులు ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

 ప్రముఖ కళాకారులతో ధూం ధాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్‌ రావు, కలిశెట్టి అప్పలనాయుడు, ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. దేశానికి అంబేద్కర్‌ చేసిన మేలు మరువలేనిదన్నారు. చాయ్‌ అమ్ముకునే వ్యక్తి ప్రధాని కాగలిగారంటే అది రాజ్యాంగం గొప్పతనమన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ స్థాపనలో అంబేద్కర్‌ కృషి చిరస్మరణీయమని మరో ఎంపీ బీద మస్తాన్‌ రావు కొనియాడారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగంతోనే బడుగులకు మేలు జరుగుతుందని చెప్పారు. 

90% పేద వర్గాలున్న దేశంలో అంబేద్కర్‌ అందరికీ ఆత్మవిశ్వాసం కలిగించారని, ఆయన స్ఫూర్తి, బడుగు వర్గాల వారిని ముందుకు తీసుకెళ్తుందని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. కరెన్సీ నోటు-పై అంబేద్కర్‌ ఫొటోను ముద్రించడం వల్ల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచవచ్చని ఎంపీలు అభిప్రాయపడ్డారు. కళాకారులు ఏపూరి సోమన్న, రేలారే రేలా ఫేమ్‌ గంగాతో పాటు పలువురు పాల్గొన్నారు.