యూట్యూబర్​ : స్కూల్​ లైఫ్​ తెచ్చిన సక్సెస్​

యూట్యూబర్​ : స్కూల్​ లైఫ్​ తెచ్చిన సక్సెస్​

వయసు చూస్తే.. నిండా పాతికేండ్లు కూడా లేవు. కానీ.. కొన్ని లక్షలమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. సోషల్​ మీడియాలో ట్రెండింగ్​లో ఉండే కంటెంట్​ క్రియేటర్​గా పేరు తెచ్చుకున్నాడు మృదుల్. అతను చేసిన కొన్ని వీడియోలకు 200 మిలియన్లకు పైగా వ్యూస్​ వచ్చాయి.

ప్రస్తుతం ఇండియాలోని టాప్​ సెలబ్రిటీ యూట్యూబర్లలో మృదుల్ ఒకడు. అతని యూట్యూబ్ ఛానెల్​కి14.6 మిలియన్ల మందికి పైగా సబ్‌‌స్క్రయిబర్లు ఉన్నారు. మృదుల్ తివారి 2000 మార్చి 7న ఉత్తర​ప్రదేశ్‌‌లోని నోయిడాలో పుట్టాడు. తండ్రి రాఘవేంద్ర తివారి, తల్లి శశి. అక్క ప్రగతి కూడా మృదుల్​తో పాటు యూట్యూబ్​లోనే వీడియోలు చేస్తుంది. మృదుల్ తన స్కూల్​ ఎడ్యుకేషన్​ని గ్రేటర్ నోయిడాలోని ఆర్యదీప్ పబ్లిక్ స్కూల్​లో చదివాడు. ప్లస్​ టు మంచి మార్కులతో పాసయ్యాడు. తర్వాత హోటల్ మేనేజ్‌‌మెంట్ చదవాలనుకున్నాడు. కానీ.. కొన్ని పరిస్థితుల వల్ల మీరట్ యూనివర్సిటీలో బీఎస్సీ చేశాడు.

యూట్యూబ్​ జర్నీ మొదలైంది ఇలా..

మృదుల్ తివారీకి కామెడీ వీడియోలు చూడటం చాలా ఇష్టం. అందుకే అతను యూట్యూబర్​ అమిత్ భదానా చేసే వీడియోలు ఎక్కువగా చూసేవాడు. అతని స్ఫూర్తితోనే మృదుల్​కి యూట్యూబ్​లో వీడియోలు చేయాలనే ఆలోచన వచ్చింది. అలా.. మృదుల్ యూట్యూబ్ జర్నీ 2015లో మొదలైంది. ‘ది మృదుల్​’ పేరుతో ఛానెల్ పెట్టాడు. కానీ.. 2018 నుంచి కంటెంట్​ పోస్ట్​ చేస్తున్నాడు. మొదట్లో అక్క ప్రగతితో కలిసి వీడియోలు చేసేవాడు. ఆ తర్వాత చాలామంది యాడ్​ అయ్యారు. ఛానెల్​లో పూర్తిగా కామెడీ వీడియోలే పోస్ట్​ చేస్తుంటాడు. కాకపోతే.. ప్రతి వీడియోలో కామెడీతోపాటు ఏదో ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. మొదట్లో వీడియోలు పోస్ట్​ చేసినప్పుడు అంత రెస్పాన్స్​ రాలేదు. ఎక్కువ మందికి రీచ్​ కాలేదు కూడా. అయినా.. వీడియోలు అప్​లోడ్​ చేయడం ఆపలేదు. ఏదో ఒకరోజు కచ్చితంగా సక్సెస్​ వస్తుందనే నమ్మకంతో కంటిన్యూ చేశాడు. చివరికి సక్సెస్​ అయ్యాడు. మృదుల్ చిన్నప్పటి నుంచి ఏ పనైనా కొత్తగా చేసేందుకు ప్రయత్నించేవాడు. ఆ కొత్తదనమే అతనికి సక్సెస్​ తీసుకొచ్చింది. మూడేండ్ల క్రితం స్కూల్​ లైఫ్​ మీద కొన్ని కామెడీ వీడియోలు చేశాడు. అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2018 అక్టోబర్​లో కంటెంట్​ వీడియోలు అప్​లోడ్​ చేయడం మొదలుపెడితే.. సంవత్సరం గడిచేసరికి ఛానెల్​కు లక్షమంది సబ్​స్క్రయిబర్లు మాత్రమే వచ్చారు. కానీ.. ఆ తర్వాత సంవత్సరం 2020 మార్చి నాటికి సబ్​స్క్రయిబర్​ల సంఖ్య మిలియన్ మార్క్​ని దాటింది. యూట్యూబ్‌‌తో పాటు మృదుల్​కు ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో కూడా ఫాలోయింగ్​ బాగుంది.

ఒక్కడి నుంచి మొదలై...​

వీడియోలు క్లిక్​ అవుతుండడంతో కంటెంట్​ తీయడానికి మృదుల్ ఒక టీం తయారు​ చేసుకున్నాడు. అందుకే మృదుల్​ వీడియోల్లో ఎప్పుడూ వాళ్లే కనిపిస్తుంటారు. మృదుల్​తోపాటు వాళ్లకు కూడా మంచి పేరొచ్చింది. మృదుల్ సక్సెస్​కు వాళ్లు కూడా ముఖ్య కారణం. మృదుల్​ అక్క ప్రగతి... తల్లి రోల్స్​ ఎక్కువగా చేస్తుంటుంది. ఛానెల్​ వల్ల ప్రగతికి కూడా ఫాలోయింగ్​ బాగా పెరిగింది. ఇన్​స్టాగ్రామ్‌‌లో ఆమెను 1.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఈమెతోపాటు​ వీడియోల్లో నితిన్... తండ్రి, సోదరుడి రోల్స్​ చేస్తుంటాడు. ఉజ్వల్, ఆరవ్.. మృదుల్ ఫ్రెండ్స్​ రోల్స్​ చేస్తుంటారు. వీళ్లంతా ​ కలిసి ‘ది మృదుల్‌‌’ని టాప్​లో నిలబెట్టారు.

నెట్​వర్త్​  

వీడియోల్లో ప్రమోషన్స్​ కూడా చేస్తుంటాడు. ఆ వీడియోలకు డబ్బులు బాగా వస్తాయి. కొన్ని స్పాన్సర్‌‌షిప్ వీడియోలు కూడా చేస్తుంటాడు. యూట్యూబ్​ నుంచి నెలకు దాదాపు ఆరు నుండి ఎనిమిది లక్షల రూపాయలు వస్తున్నాయి. మొత్తంగా ఇప్పటివరకు 8 కోట్ల వరకు సంపాదించాడు మృదుల్​.