ఫోన్ తగ్గించి ఆటలకు సమయం ఇవ్వండి.. జెన్ జెడ్‌ కుర్రాళ్లకు ధోనీ కీలక సూచన

ఫోన్ తగ్గించి ఆటలకు సమయం ఇవ్వండి.. జెన్ జెడ్‌ కుర్రాళ్లకు ధోనీ కీలక సూచన

MS Dhoni: డిజిటల్ యుగంలో గంటల తరబడి ఒకే చోట కూర్చునే నేటి యువతరం (Gen Z, Gen Alpha) జీవనశైలిపై భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం లేదా ఏదో ఒక క్రీడ ఆడాలని పిలుపునిచ్చారు. బెంగళూరులో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్‌తో (Javed Akhtar) కలిసి పాల్గొన్న ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఇరువురు దిగ్గజాలు నేటి యువత ఆరోగ్యం, ఆలోచన విధానాలపై అద్భుతమైన చర్చ జరిపారు. 

ధోనీ హెచ్చరిక: 

నేటి తరం జీవనశైలిలో వచ్చిన మార్పులను ఎంఎస్ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు మానవ జీవితంలో నిరంతర కదలిక సహజంగా ఉండేది.. కానీ నేటి తరం యువత ఇంట్లో నుంచి కారులో ఆఫీసుకు వెళ్లడం, గంటల తరబడి కుర్చోవడానికే పరిమితమైందన్నాడు. దీనివల్ల శరీరానికి కనీస శ్రమ కూడా దక్కడం లేదు.. నూనెలో వేయించిన పదార్థాలు, చక్కెర అధికంగా ఉండే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తీనడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని తేల్చి చెప్పాడు. ఈ బద్ధకపు లైఫ్‌స్టైల్ ప్రభావం ఇప్పుడే తెలియకపోయినా.. 30 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత తీవ్ర అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే వరకు వేచి చూడకండి అని ఎంఎస్ ధోనీ హెచ్చరించారు. ప్రతి రోజూ మైదానంలోకి దిగి ఏదో ఒక ఆట ఆడాలని సూచించారు.

జావేద్ అక్తర్ ప్రశంసలు: 

ఇదే వేదికపై పాల్గొన్న ప్రముఖ కవి, రచయిత జావేద్ అక్తర్ నేటి యువతపై తన అభిప్రాయాలను పంచుకుంటూ అరుదైన ప్రశంసలు గుప్పించారు. పాత తరాలతో పోలిస్తే నేటి జెన్-జెడ్ తరం ఎన్నో విషయాల్లో ఎంతో పరిణతి చెందింది. మా తరం తరచుగా పాత ఆలోచనలు, మూస పద్ధతుల్లో చిక్కుకుపోయేది. కానీ నేటి యువత నైతిక విలువలు, సానుకూల ధోరణిలో ఎంతో ముందుంది. పెద్దవాళ్లమైన మనం మనకే అన్నీ తెలుసని భావించకుండా, కొత్త తరం ఆలోచనల నుంచి నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు.