అతడే ఓ ‘మహి’మ

అతడే ఓ ‘మహి’మ

1983లో కపిల్‌ డేవిల్స్‌ సంచలనం సృష్టించిన తర్వాత.. ఎంతో మంది దిగ్గజ కెప్టెన్లు టీమిండియాను నడిపించారు. కానీ ఒక్కరు కూడా ప్రతిష్టాత్మక వరల్డ్‌ కప్‌ ను ఇండియాకు తీసుకురాలేకపోయారు. దాదాపు 28 ఏండ్లుగా అందరూ ప్రయత్నించారు.. విఫలమయ్యారు. ఈమధ్యలో ఎంతో మంది ఆటగాళ్లు.. లెజెండ్ బ్యాట్స్‌ మెన్‌ గా, బౌలర్లు గా క్రికెట్‌‌‌‌ ప్రపంచాన్ని ఏలారు. అనితర సాధ్యమైన రికార్డులతో కొత్త చరిత్రకు ప్రాణం పోశారు. కానీ వాళ్లలో నుంచి ఇండియా జట్టుకు జీవం పోసే కెప్టెన్‌ మాత్రం రాలేకపోయాడు.

ఇక ఇండియాకు వరల్డ్‌ కప్‌ రావడం అసాధ్యం అనుకున్న పరిస్థితుల్లో.. మెరుపులా వచ్చి టీమిండియా పగ్గాలు చేపట్టిన మహేంద్ర సింగ్‌ ధోనీ.. రెండున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ ప్రపంచకప్‌ ను భారత గడ్డపై తీసుకొచ్చాడు. అప్పట్నించి ఇప్పటివరకు టీమ్‌ కు పెద్ద దిక్కుగా మారి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎంతో మంది కుర్రాళ్లను వెలుగులోకి తెచ్చాడు. 15 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్‌ లో అత్యున్నత విజయాలను ఖాతాలో వేసుకున్న ఈ జార్ఖండ్‌‌‌‌ డైనమెట్‌‌‌‌.. ఇప్పుడు నాలుగోసారి వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగబోతున్నాడు . బ్యాట్స్​మన్​గా, కీపర్‌ గా, ఫినిషర్​గా, నాన్‌ కెప్టెన్‌ గా, మార్గదర్శకుడిగా రకరకాల పాత్రలతో తన బాధ్యతలను విస్తరించుకున్న ధోనీ.. ఇంగ్లండ్‌‌‌‌ గడ్డపై ఏం చేస్తాడన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న..!

‘ఎదురుగా ట్రక్‌‌‌‌ వస్తుంటే.. దానికి ఎదురెళ్లి నిలబడే దమ్ము, ధైర్యం ఉన్న 15 మంది కుర్రాళ్లను నాకు ఇవ్వండి.  మీకు ఎలాంటి విజయాలు కావాలో నేను సాధించిపెడుతా’.. కెప్టెన్సీ చేపట్టిన తొలినాళ్లలో ధోనీ చెప్పిన మాటలు ఇవి. అప్పట్లో ఇవి ఆశ్చర్యాన్ని కలిగించినా.. ఇప్పుడున్న టీమిండియా రూపుదిద్దుకోవడానికి అద్భుతమైన బీజాక్షరాలుగా పని చేశాయి.  సీనియర్లతో సమన్వయం చేసుకుంటూ.. జూనియర్లను గాడిలో పెట్టుకుంటూ ధోనీ సాధించిన జైత్రయాత్ర అంతాఇంతా కాదు.  టెస్ట్‌‌‌‌, వన్డే, టీ20.. ఫార్మాట్‌‌‌‌ ఏదైనా.. బరిలోకి దిగితే విజయం మనదే అన్న స్థాయిలో జట్టును తీర్చిదిద్దాడు.  అనితర సాధ్యమైన ఎన్నో విజయాలను రాబట్టాడు.  తర్వాత కొన్ని బాధ్యతల నుంచి తప్పుకున్నా.. కెరీర్‌‌‌‌ చరమాంకంలో నిలిచినా.. ఇప్పటికీ వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ అంటే ధోనీ వైపు చూసే పరిస్థితులు టీమ్‌‌‌‌లో ఉన్నాయంటే అతని ప్రభావం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ధోనీ.. ఇంగ్లండ్‌‌‌‌ గడ్డపై ఎందుకు కీలకమో తెలుసుకుందాం..!

యువకులకు మార్గదర్శకుడిగా
జట్టులో ధోనీ ఉండటం కుర్రాళ్లకు చాలా అవసరం. బ్యాటింగ్‌‌‌‌, బౌలింగ్‌‌‌‌లో లైన్‌‌‌‌ తప్పినప్పుడల్లా వాళ్లను సరైన రీతిలో నడిపించేది ధోనీయే. ఈ ఒక్క విషయమే అతనికి జట్టులో ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. క్లిష్ట పరిస్థితుల్లో  ధోనీ ఇచ్చిన సలహాలు, సూచనలతోనే కుర్రాళ్లు మ్యాచ్‌‌‌‌ గెలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మైదానం లోపలా, వెలుపలా ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా చూస్తాడు. ఐపీఎల్‌‌‌‌ కావొచ్చు, టీమిండియా మ్యాచ్‌‌‌‌ కావొచ్చు.. ఇబ్బందుల్లో ఉన్న ఆటగాడికి మొదటి సాయం ధోనీ నుంచే అందుతుంది. చహల్‌‌‌‌, కుల్దీప్‌‌‌‌, రిషబ్‌‌‌‌.. ధోనీ సలహాలతో మెరుపులు మెరిపించి వెలుగులోకి వచ్చారు. ఇక వికెట్ల వెనుక ధోనీ ఉన్నాడంటే బౌలర్లలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. యువ పేసర్లు, స్పిన్నర్లుకు ఎక్కడలేని బలం వస్తుంది.  ఫీల్డింగ్‌‌‌‌ ప్రయోగాలతో పాటు ఏ సమయంలో ఎలాంటి బంతులు వేయాలో చెబుతూ మ్యాచ్‌‌‌‌పై పట్టు పెంచుతాడు.  ఆటను ధోనీ రీడ్‌‌‌‌ చేసే విధానంపై కోహ్లీ ఎన్నోసార్లు, ఎన్నో ప్రెస్‌‌‌‌మీట్స్‌‌‌‌లో బహిరంగంగానే చెప్పాడు.  ఒడిదొడుకులతో ఉన్న ఎంతో మంది కెరీర్‌‌‌‌ గాడిలో పడటానికి ఉపయోగపడ్డాడు. ఏదేమైనా టీమిండియా క్యాంప్‌‌‌‌కు ధోనీ ఓ తండ్రిలాంటి వాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఆటగాడు జట్టులో ఉండటం అదృష్టమే.

విరాట్‌‌‌‌కు చాలా అవసరం
టీమిండియాలో ధోనీ ఉండటం ఆటగాళ్లకు ఎంత అవసరమో.. కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌కు అంతకంటే ఎక్కువ అవసరం. ఫస్ట్‌‌‌‌ నుంచి లాస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌ వరకు మ్యాచ్‌‌‌‌ పరిస్థితిని అర్థం చేసుకునే ధోనీ ఇచ్చే సలహాలు, సూచనలతో కోహ్లీ ఇప్పటివరకు విజయవంతమయ్యాడు. ఇది చాలా సందర్భాల్లో, చాలా మ్యాచ్‌‌‌‌ల్లో నిరూపితమైంది. ఇక రెట్టింపు ఒత్తిడి ఉండే వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో మ్యాచ్‌‌‌‌లు గెలవాలంటే ఒక్క విరాట్‌‌‌‌ వ్యూహాలు సరిపోవు. పేరుకు విరాట్‌‌‌‌ నాయకుడే అయినా.. ఇప్పటికీ ఫీల్డ్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ మాత్రం ధోనీయే.  ఏ సమయంలో ఏ బౌలర్‌‌‌‌ను ఉపయోగించాలి.. ఏ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌కు ఎక్కడ ఫీల్డింగ్‌‌‌‌ మోహరించాలనే ట్రిక్స్‌‌‌‌ ఇప్పటికీ విరాట్‌‌‌‌.. ధోనీ నుంచి నేర్చుకుంటుంటాడు. మ్యాచ్‌‌‌‌ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు విరాట్‌‌‌‌ సింపుల్‌‌‌‌గా ధోనీ చేతుల్లో పెట్టేసి బౌండ్రీ లైన్‌‌‌‌ వద్ద ఫీల్డింగ్‌‌‌‌కు వెళ్లిపోతాడు. చాలాసార్లు దీనిని మనం చూశాం కూడా. ఈ ఇద్దరి మధ్య మంచి సమన్వయం కుదిరింది కాబట్టే.. కెప్టెన్సీ మార్పు కూడా చాలా సున్నితంగా జరిగిపోయింది. స్పోర్ట్స్‌‌‌‌మ్యాన్‌‌‌‌ స్పిరిట్‌‌‌‌తో ఈ ఇద్దరు కలిసి టీమిండియాను నడిపిస్తున్న తీరు అద్భుతం, అమోఘం.

వికెట్ల మధ్య చురుకు
దీనికి జవాబు కావాలంటే.. మొన్న ఆ మధ్య  హార్దిక్‌‌‌‌, ధోనీ మధ్య జరిగిన 100 మీటర్ల పరుగు పందెం వీడియో చూస్తే చాలు. టీమిండియాలో అందరికంటే వేగంగా పరుగెత్తే హార్దికే.. ధోనీతో పోటీపడలేకపోయాడు. చెన్నై సూపర్‌‌‌‌కింగ్స్‌‌‌‌ ఆటగాడు డ్వేన్‌‌‌‌ బ్రావో కూడా మహీతో సమానంగా రన్నింగ్‌‌‌‌ చేయలేకపోయాడు. 37 ఏండ్ల వయసులోనూ వికెట్ల మధ్య అందరికంటే వేగంగా పరుగెత్తే ధోనీ సింగిల్స్‌‌‌‌ను డబుల్స్‌‌‌‌గా మారుస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు ఫీల్డింగ్‌‌‌‌ పొజిషన్‌‌‌‌ను బట్టి కూడా రన్నింగ్‌‌‌‌ను మార్చుకోగల నేర్పరి ధోనీ.  వికెట్ల వెనుకాల ఎంత వేగంగా స్పందిస్తాడో.. వికెట్ల మధ్య అంతకంటే రెట్టింపు వేగంతో పరుగెత్తగల దిట్ట.

సూపర్‌‌‌‌ ఫినిషర్‌‌‌‌
ధోనీలో ఫినిషింగ్‌‌‌‌ సామర్థ్యం తగ్గిపోయిందని, పరిమిత ఓవర్ల క్రికెట్‌‌‌‌కు పనికిరాడని ఐపీఎల్‌‌‌‌కు ముందు మాజీలు, కొంతమంది అభిమానులు తీవ్రస్థాయిలో గగ్గోలు పెట్టారు. కానీ ఏమైంది.. ఐపీఎల్‌‌‌‌లో ధోనీ మెరుపులు చూశాక… ఇప్పటికీ టీమిండియా బెస్ట్‌‌‌‌ ఫినిషర్‌‌‌‌ ధోనీయే అని తేలిపోయింది. బ్యాటింగ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌తో సంబంధం లేకుండా క్రీజులోకి వచ్చాడంటే మ్యాచ్‌‌‌‌ రూపురేఖలు మార్చే సత్తా ఉన్న ఆటగాడు ధోనీ. సహచరులు విఫలమైనా.. టార్గెట్‌‌‌‌ పెద్దగా ఉన్నా ధోనీ ఒత్తిడికి లోనైన సందర్భాలు లేవు. తన ట్రేడ్‌‌‌‌ మార్క్‌‌‌‌ షాట్లతో బంతిని బుల్లెట్‌‌‌‌లా బౌండ్రీ లైన్‌‌‌‌ దాటించే సామర్థ్యం అతని సొంతం. ఐపీఎల్‌‌‌‌లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌‌‌‌లో ధోనీ చెలరేగిన తీరే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.  చివరి ఓవర్‌‌‌‌లో 20 పరుగులు చేయాల్సి ఉన్నా.. క్రీజులో ధోనీ ఉన్నాడంటే ఎదురుగా ఉండే బౌలర్‌‌‌‌కు వణుకు పుట్టాల్సిందే. ఈ ఫినిషింగ్‌‌‌‌ మంత్రం ఇంగ్లండ్​లో సక్సెస్‌‌‌‌ కావాలన్నది అభిమానుల ఆకాంక్ష.

వికెట్ల వెనక మెరుపు వేగం
వికెట్ల వెనుక ధోనీ ఉంటే బౌలర్‌‌‌‌ ఎలా సంతోషపడుతాడో.. బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ అంతకంటే ఎక్కువగా భయపడతాడు.  బంతిని డిఫెన్స్‌‌‌‌ చేయడానికి కూడా క్రీజు దాటే సాహసం చేయడు. వయసు పైబడుతున్నా.. ధోనీ చేసే మెరుపు స్టంపింగ్‌‌‌‌ ఇప్పటికీ అభిమానుల మదిని దోచుకుంటూనే ఉంది. ఫ్లాష్‌‌‌‌కు కూడా ఒక్క సెకన్‌‌‌‌ సమయం తీసుకుంటుందేమోగానీ, ధోనీ స్టంపింగ్‌‌‌‌కు మాత్రం అరసెకనే సరిపోతుంది. ధోనీతో పోలిస్తే కీపింగ్‌‌‌‌ విషయంలో లెజెండ్‌‌‌‌ వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌ ఆడమ్‌‌‌‌ గిల్‌‌‌‌క్రిస్ట్‌‌‌‌ ఓ అడుగు వెనకాలే ఉంటాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా ఒప్పుకున్నాడు కూడా. వికెట్ల వెనకాల క్యాచ్‌‌‌‌లు పట్టడంలోనూ మహీని తక్కువగా అంచనా వేయలేం. ఇక డీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అయితే ధోనీ రివ్యూ సిస్టమ్‌‌‌‌గా మారిపోయింది. 85 శాతం కచ్చితమైన నిర్ణయాలు తీసుకున్న ఆటగాడిగా ధోనీ అందరికంటే ముందున్నాడు.
– వెలుగు క్రీడావిభాగం

ధోనీకి చాలా అనుభవం ఉంది.  ఎన్నో ఏళ్లు జట్టును విజయపథంలో నడిపించాడు.  కాబట్టి ఇంగ్లండ్‌‌‌‌లో అతని పాత్ర చాలా కీలకం. ప్లేయర్‌‌‌‌గా, బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌గా కాకుండానే వ్యక్తిగతంగానూ అతను జట్టుకు ఎంతో అవసరం. మహీ సలహాలు, సూచనలు ప్లేయర్లపై చాలా ప్రభావం చూపిస్తాయి. ప్రతి ఆటగాడికి అతను సాయం చేసేందుకు ముందుంటాడు. వికెట్‌‌‌‌ కీపింగ్‌‌‌‌లో ధోనీని మించినోళ్లు లేరు. పిచ్‌‌‌‌ గురించి, బంతులు ఎలా, ఏ ప్రదేశంలో వేయాలని కుల్దీప్‌‌‌‌, చహల్‌‌‌‌కు చాలా విషయాలు చెబుతుంటాడు. ఈ అంశాలన్ని చాలా ప్రభావితం చేస్తాయి. ఓ రకంగా చెప్పాలంటే ధోనీ జట్టులో ఉండటం మా అదృష్టం.

– రోహిత్‌‌‌‌ శర్మ