కశ్మీర్‌లో ఇన్ని బలగాలా..? ఏదో జరుగుతోంది.. ముఫ్తీ డౌట్స్

కశ్మీర్‌లో ఇన్ని బలగాలా..? ఏదో జరుగుతోంది.. ముఫ్తీ డౌట్స్

జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో కేంద్ర బలగాల మోహరింపుపై చాలా డౌట్లు వస్తున్నాయని PDP నాయకురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. కేంద్రం ఏదో పెద్ద ప్లానే వేస్తోందని ఆమె అన్నారు. “బీజేపీ కీలక నాయకుల మాటలు వింటున్నా…. కేంద్ర బలగాల మోహరింపు చూస్తున్నా… సగటు కశ్మీరీకి కచ్చితంగా సందేహాలు వస్తున్నాయి. రాజకీయాలతో సంబంధం లేకుండా ఏదే చేయబోతున్నారా అనిపిస్తోంది. ఈ బలగాలను చూస్తే.. కేంద్రం ఏదో పెద్ద పనికే ప్రణాళిక వేసినట్టుగా అనిపిస్తోంది. ఇది కశ్మీరీల మనుగడకు ప్రమాదకరం. లైఫ్ అండ్ డెత్ సమస్యలాంటిది” అన్నారు ముఫ్తీ.

జులై నెలలో కశ్మీర్ శాంతి భద్రతలకు సంబంధించి కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లో భారత భూభాగంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారీ ఉగ్రదాడికి ప్రణాళిక వేసినట్టుగా సంకేతాలు అందాయనీ… అందుకే… కశ్మీర్ లో 100 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించబోతున్నామని తెలిపింది. కశ్మీర్ లో శాంతి భద్రతల నిరంతర పర్యవేక్షణ కోసం 100 కంపెనీల సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సెస్ ను దింపుతోంది. ఇందులో.. 50 కంపెనీల CRPF బలగాలున్నాయి. సశస్త్ర సీమా బల్(SSB) బలగాలు 30 కంపెనీలు ఉన్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)  చెరో 10 కంపెనీలు ఉన్నాయి.

కశ్మీర్ లో బలగాల మోహరింపు… భారత రాజ్యాంగం తమ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హక్కులను దెబ్బతీయొచ్చని మెహబూబా ముఫ్తీ చెప్పారు. ఈ పరిస్థితిని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి ఎదుర్కోవాలన్నారు. పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ , ఇతర పార్టీలు కలిసి పోరాడాలని చెప్పారు. ఐతే.. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుల తీరు బాలేదని ఆమె తన అసంతృప్తిని తెలిపారు. “ఫరూక్ అబ్దుల్లా.. ఢిల్లీలో మోడీని కలిసి ఎన్నికలపై మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆర్టికల్ 35 ఏ, ఆర్టికల్ 370 గురించి మాట్లాడాల్సింది. ఈ సమయంలో అవే కశ్మీర్ కు చాలా కీలకం” అన్నారామె.