పోలీసులే చంపేశారు... ముఖ్తార్ అన్సారీ కుటుంబసభ్యుల ఆరోపణ

పోలీసులే చంపేశారు... ముఖ్తార్ అన్సారీ కుటుంబసభ్యుల ఆరోపణ
  • విచారణ జరిపించాలని ప్రతిపక్షాల డిమాండ్ 

న్యూఢిల్లీ: గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి పోలీసులే విషమిచ్చి చంపేశారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లోని బాందా జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్సారీ గురువారం రాత్రి అస్వస్థతకు గురికావడంతో అధికారులు ఆస్పత్రికి తరలించగా, అక్కడ ట్రీట్ మెంట్ పొందుతూ కార్డియాక్ అరెస్ట్ తో ఆయన చనిపోయారు. ‘‘జైలులో తనకు ఆహారంలో విషం కలిపి ఇచ్చారని 40 రోజుల కింద అన్సారీ చెప్పారు. మళ్లీ ఈ నెల 19న కూడా అన్సారీకి పోలీసులు విషమిచ్చారు. స్లో పాయిజన్ కారణంగానే ఆయన చనిపోయారు” అని అన్సారీ సోదరుడు అఫ్జల్ అన్సారీ ఆరోపించారు. ‘‘మా నాన్నకు ఈ నెల 19న డిన్నర్ లో స్లో పాయిజన్ ఇచ్చారు. దీనిపై మేం కోర్టుకు వెళ్తాం” అని అన్సారీ కొడుకు ఉమర్ తెలిపారు.

అన్సారీ మృతిపై విచారణ జరిపించాలని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎంఐఎం చీఫ్​ అసదుద్దీన్ ఒవైసీ, ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. కాగా, 1980లో గ్యాంగ్​స్టర్​గా మారిన అన్సారీ.. ఆ తర్వాత 1990లో తానే ఓ గ్యాంగ్​ను ఏర్పాటు చేశాడు. మవూ, ఘాజీపూర్, వారణాసి, జౌన్ పూర్ జిల్లాల్లో దోపిడీలు, హత్యలు, కిడ్నాప్​లకు పాల్పడ్డాడు. అతనిపై 60 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అందులో 15 మర్డర్ కేసులు ఉన్నాయి. కొన్నాళ్లకు రాజకీయ నాయకుడిగా ఎదిగిన అన్సారీ.. మవూ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. వివిధ కేసుల్లో 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 

న్యాయం జరిగింది: అల్కా రాయ్ 

అన్సారీ మృతితో తనకు న్యాయం జరిగిందని హత్యకు గురైన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ భార్య అల్కా రాయ్ అన్నారు. కృష్ణానంద్​ను ముఖ్తార్ అన్సారీనే చంపేశారని ఆరోపించారు. ‘ఇది ఆ దేవుడి అనుగ్రహం. ఎన్నో రోజులుగా న్యాయం కోసం ప్రార్థిస్తున్నా. అది ఈ రోజు జరిగింది’ అని అల్కా రాయ్ పేర్కొన్నారు. 

ఘాజీపూర్ కు అన్సారీ బాడీ.. 

పోస్టుమార్టం అనంతరం అన్సారీ డెడ్ బాడీని ఆయన సొంతూరు ఘాజీపూర్​కు పోలీసులు తరలించారు. శనివారం అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు అన్సారీ భార్య అఫ్సా అన్సారీ వస్తుందా? లేదా? అని పోలీసులు చూస్తున్నారు. లేడీ డాన్​గా పేరొందిన అఫ్సా.. ప్రస్తుతం పరారీలో ఉంది.