నాగోల్​లో అత్యాధునిక వసతులతో ‘ముక్తిఘాట్’

నాగోల్​లో అత్యాధునిక వసతులతో ‘ముక్తిఘాట్’
  • అంత్యక్రియలను ఆన్​లైన్​లో చూసేలా..నాగోల్​లో అత్యాధునిక వసతులతో ‘ముక్తిఘాట్’
  •  హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాల సంప్రదాయ కార్యక్రమాలకు వెసులుబాటు
  •  ఎలక్ట్రిక్ క్రిమియేషన్ కోసం సోలార్ పవర్ సిస్టమ్    తొందరలోనే అందుబాటులోకి..

ఎల్ బీనగర్, వెలుగు: మనిషి  జీవితాంతం  ఎన్ని  ఆస్తులు, అంతస్తులు సంపాదించినా  చివరికి మిగిలేవి ఖాళీ చేతులే.  మనిషి కాటికి  చేరాడంటే అక్కడే బంధాలన్నీ తెగిపోతాయి. జీవితాంతం ఆ మనిషి మోసిన కులం, మతం మట్టిలో కలిసిపోతాయి. బతికున్నప్పుడు విలువ ఇవ్వకపోయినా..  చావునైనా గౌరవించాలి అంటారు. అందుకే చనిపోయిన తర్వాత అంతిమ యాత్రను శ్మశాన వాటిక వరకు ఊరేగింపుగా చేస్తారు. కష్టాల కడలిని ఈదిన మనిషి జీవితం.. చివరి యాత్రలోనైనా సుఖంగా ఉండాలని, ఆఖరి మజిలీలో సమస్యలు ఉండొద్దని కోరుకుంటారు. ఇందుకోసం  కులమతాలకు అతీతంగా, శ్మశానవాటికలో దహనసంస్కారాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా అత్యాధునిక పద్ధతులు, అన్ని సౌకర్యాలతో ఎల్ బీనగర్ పరిధి నాగోల్​లో ‘ముక్తిఘాట్’ నిర్మించారు.- విదేశాల నుంచి అంత్యక్రియలకు రాలేని వారి కోసం వీడియో కాస్టింగ్ సైతం ఏర్పాటు చేశారు.  హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు  ఒకే చోట  ఎవరి పద్దతుల్లో వారు దహన సంస్కారాలు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. 

అన్ని సౌకర్యాలు..  

ముక్తిఘాట్​లో ఉద్యానవనంలా చెట్లు,  ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. సిటీలో ఎన్నో శ్మశానవాటికలు ఉన్నప్పటికీ  సరైన సౌలతు​లు లేవు.   అలాంటి సమస్యలను దూరం చేయడానికి సిటీ శివారులో ఉన్న సుమారు 2.5 ఎకరాల స్థలంలో సుమారు రూ.2 కోట్ల 50 లక్షలతో  ముక్తిఘాట్​ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. ఇక్కడ  హిందూ, ముస్లిం,  క్రైస్తవ మతాల వారి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. తమ ఆచార వ్యవహారాల ప్రకారం అంత్య క్రియలు చేసుకునేలా   అన్ని ఏర్పాట్లు  చేశారు. మూడు మతాల కోసం ఏర్పాటు చేసిన సెక్షన్లలో ప్రత్యేక ఆఫీసు,  కోల్డ్ స్టోరేజీలు, ప్రార్థనా మందిరాలు,సెక్యూరిటీ గార్డుల గదులు, టాయిలెట్ బ్లాక్‌‌‌‌లు నిర్మించారు.

సోలార్ పవర్ ప్లాంట్

140 కిలోవాట్స్ కెపాసిటీ సోలార్ పవర్ ప్లాంట్​తో 80 శాతం  కరెంట్​ను ఎలక్ట్రికల్ క్రిమియేషన్​ను రూపొందించారు.  హిందూ సంప్రదాయం ప్రకారం  కర్మలు చేసేందుకు ప్రత్యేక భవనం  ఉంది.   క్రిస్టియన్, ముస్లిం శ్మశాన వాటికలను 3 పొరల్లో ప్రతి విభాగంలో 550 మృతదేహాలను ఉంచడానికి స్థలంతో ఏర్పాట్లు చేశారు. మూడు మృతదేహాలను ఒకే స్థలంలో వివిధ లోతుల్లో ఖననం చేసేందుకు వీలుగా పొరలతో శ్మశాన వాటికను నిర్మించడం ఇదే తొలిసారి. పండితుల కోసం ప్రత్యేక గదులు  ఉన్నాయి.  క్రిస్టియన్ల కోసం ప్రార్థనా స్థలంతో పాటు అక్కడే వారి ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా అంత్యక్రియలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.  అయితే శ్మశాన పరిసరాల్లో సౌండ్​ పొల్యూషన్​ లేకుండా.. కొద్ది దూరంలోనే బ్యాండ్ సౌండ్స్ బంద్ చేసి లోపలికి వచ్చేలా చూస్తామని అధికా
రులు చెప్తున్నారు. 

ఆన్ లైన్​లో..

ఎవరైనా చనిపోతే ఇతర దేశాలలో ఉన్నవారు తమకు అయిన వారి అంత్యక్రియలు చూడలేక బాధపడుతుంటారు.  అలాంటి వారి కోసం ఆన్ లైన్ లో లైవ్ వీడియో కాస్టింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఏ దేశంలో ఉన్నా  ఆన్ లైన్ లో  చూసేలా కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కడి నుంచైనా అంత్యక్రియలను ఆన్ లైన్ లో చూసుకోవచ్చు.

దేశంలో ఎక్కడా లేని విధంగా

కులమతాలకు అతీతంగా ఒక మహాప్రస్థానం ఉండాలని  దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని సౌకర్యాలతో  ముక్తిఘాట్ నిర్మించాం.  ఈ ప్రాంత వాసులకు అన్ని వసతులతో శ్మశాన వాటిక అందుబాటులోకి తీసుకురావటం సంతోషంగా ఉంది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఇక్కడ జరిగే అంత్యక్రియలు చూసుకునే విధంగా ఏర్పాట్లు చేశాం. తొందరలోనే దీన్ని ప్రారంభించి.. అందుబాటులోకి తీసుకొస్తం.       
- దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎల్ బీనగర్ ఎమ్మెల్యే