దంచికొట్టిన ముకుల్.. కోల్‌కతాపై లక్నో గెలుపు

దంచికొట్టిన ముకుల్.. కోల్‌కతాపై లక్నో గెలుపు
  • 3 వికెట్ల తేడాతో కోల్‌‌‌‌కతాపై లక్నో గెలుపు
  • రాణించిన  ఆయుష్‌‌‌‌ బదోనీ 
  • రఘువంశీ,రహానె, పావెల్‌‌‌‌ శ్రమ వృథా

 

కోల్‌‌‌‌కతా: ఐపీఎల్‌‌‌‌–19లో లక్నో సూపర్‌‌‌‌జెయింట్స్‌‌‌‌ అద్భుత విజయాన్ని అందుకుంది. చివరి రెండు ఓవర్లలో 30 రన్స్‌‌‌‌ అవసరమైన దశలో ముకుల్‌‌‌‌ చౌదరీ (27 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 7 సిక్స్‌‌‌‌లతో 54 నాటౌట్‌‌‌‌) మెరుపులు మెరిపించాడు. కామెరూన్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ వేసిన 19వ ఓవర్‌‌‌‌లో రెండు సిక్స్‌‌‌‌లు, ఓ ఫోర్‌‌‌‌తో 16 రన్స్‌‌‌‌ దంచాడు. ఇక చివరి 6 బాల్స్‌‌‌‌లో 14 రన్స్‌‌‌‌ కావాల్సిన టైమ్‌‌‌‌లో మరో రెండు సిక్సర్లు సంధించి లక్నోను గట్టెక్కించాడు. దాంతో చివరి బాల్‌‌‌‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌‌‌‌లో లక్నో 3 వికెట్ల తేడాతో కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌పై నెగ్గింది. టాస్‌‌‌‌ ఓడిన కోల్‌‌‌‌కతా 20 ఓవర్లలో 181/4 స్కోరు చేసింది. అంగ్‌‌‌‌క్రిష్‌‌‌‌ రఘువంశీ (35 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 45), అజింక్య రహానె (24 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 41), రొవ్‌‌‌‌మన్‌‌‌‌ పావెల్‌‌‌‌ (24 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 39 నాటౌట్‌‌‌‌), కామెరూన్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ (24 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 32 నాటౌట్‌‌‌‌) రాణించారు. లక్నో 20 ఓవర్లలో 182/7 స్కోరు చేసి నెగ్గింది. ఆయుష్‌‌‌‌ బదోనీ (34 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 54) నిలకడగా ఆడాడు. ముకుల్​కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

మిడిల్‌‌‌‌ ఢమాల్‌‌‌‌

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన కోల్‌‌‌‌కతాకు భారీ స్కోరు చేసే చాన్స్‌‌‌‌ వచ్చినా.. మధ్యలో లక్నో బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. రెండో ఓవర్‌‌‌‌లోనే ప్రిన్స్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (1/47) దెబ్బకు ఫిన్‌‌‌‌ అలెన్‌‌‌‌ (9) త్వరగా ఔటైనా.. రహానె, రఘువంశీ ఇన్నింగ్స్‌‌‌‌ను చక్కదిద్దారు. వీరిద్దరు పోటీపడి బౌండ్రీలు, సిక్సర్లు బాదడంతో పవర్‌‌‌‌ప్లేలో కేకేఆర్‌‌‌‌ 56/1 స్కోరు చేసింది. ఇక్కడి నుంచి సింగిల్స్‌‌‌‌, డబుల్స్‌‌‌‌తో పాటు వీలైనప్పుడల్లా బౌండ్రీలతో  స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేసిన రహానె, రఘువంశీ తర్వాతి నాలుగు ఓవర్లలో 42 రన్స్‌‌‌‌ రాబట్టారు. ఫలితంగా కోల్‌‌‌‌కతా ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌ ఓవర్స్‌‌‌‌లో 98/1 స్కోరు చేసి మంచి స్థితిలో నిలిచింది. కానీ ఇక్కడి నుంచే ఇన్నింగ్స్‌‌‌‌ తడబడింది. లక్నో స్పిన్నర్లు వికెట్లు తీయడంతో పాటు రన్స్‌‌‌‌ను నిరోధించారు. 11వ ఓవర్‌‌‌‌లో దిగ్వేశ్‌‌‌‌ రాఠీ (1/25).. రహానెను ఔట్‌‌‌‌ చేసి రెండో వికెట్‌‌‌‌కు 84 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ను ముగించాడు. తర్వాతి ఓవర్‌‌‌‌లో సిద్ధార్థ్‌‌‌‌ (1/34).. రఘువంశీని పెవిలియన్‌‌‌‌కు పంపాడు. 14వ ఓవర్‌‌‌‌లో రింకూ సింగ్‌‌‌‌ (4)ను అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (1/44) బోల్తా కొట్టించాడు. ఓవరాల్‌‌‌‌గా 12 రన్స్‌‌‌‌ తేడాలో మూడు కీలక వికెట్లు పడటంతో కేకేఆర్‌‌‌‌ స్కోరు 111/4గా మారింది. 11 నుంచి 14 ఓవర్ల మధ్య మూడు కీలక వికెట్లు పడటం, 30 బంతుల పాటు ఒక్క ఫోర్‌‌‌‌ కూడా రాకపోవడంతో 15 ఓవర్లలో స్కోరు 115/4కు పడిపోయింది. ఈ దశలో పావెల్‌‌‌‌, గ్రీన్‌‌‌‌ బ్యాట్లు ఝుళిపించారు. బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపెడుతూ ఐదో వికెట్‌‌‌‌కు 40 బాల్స్‌‌‌‌లోనే 70 రన్స్‌‌‌‌ జోడించి గౌరవప్రదమైన స్కోరు అందించారు. 

బదోనీ, ముకుల్‌‌‌‌ మెరుపులు..

ఛేజింగ్‌‌‌‌లో లక్నోను కేకేఆర్‌‌‌‌ బౌలర్లు కట్టడి చేశారు. ఇంపాక్ట్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ వైభవ్‌‌‌‌ అరోరా (2/38) నాలుగో ఓవర్‌‌‌‌లో మూడు బాల్స్‌‌‌‌ తేడాలో మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (22), మిచెల్‌‌‌‌ మార్ష్‌‌‌‌ (15)ను ఔట్‌‌‌‌ చేశాడు. 42/2తో కష్టాల్లో పడిన లక్నో ఆ వెంటనే రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ (10) వికెట్‌‌‌‌ను కోల్పోయింది. ఈ దశలో బదోనీ నిలకడగా ఆడినా రెండో ఎండ్‌‌‌‌లో నికోలస్‌‌‌‌ పూరన్‌‌‌‌ (13), అబ్దుల్‌‌‌‌ సమద్‌‌‌‌ (2) నిరాశపర్చడంతో 104 రన్స్‌‌‌‌కే సగం జట్టు పెవిలియన్‌‌‌‌కు చేరింది. 33 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ చేసిన బదోనీని అనుకూల్‌‌‌‌ రాయ్‌‌‌‌ (2/32) ఔట్‌‌‌‌ చేయడంతో లక్నో ఇన్నింగ్స్‌‌‌‌ మరింత తడబడింది. తర్వాతి ఓవర్‌‌‌‌లో మహ్మద్‌‌‌‌ షమీ (1) వెనుదిరిగాడు. 128/7 స్కోరుతో ఎదురీత మొదలుపెట్టిన లక్నోకు ముకుల్‌‌‌‌ చౌదరీ అండగా నిలిచాడు. ఆవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (1)ను రెండో ఎండ్‌‌‌‌లో నిలబెట్టి ఒంటరి పోరాటం చేశాడు. కేకేఆర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ను ఉతికేస్తూ భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఫలితంగా ఎనిమిదో వికెట్‌‌‌‌కు 24 బాల్స్‌‌‌‌లో 54 రన్స్‌‌‌‌ జత చేసి విజయాన్ని అందించాడు. 
 సంక్షిప్త స్కోర్లు
కోల్‌‌‌‌కతా: 20 ఓవర్లలో 181/4 (రఘువంశీ 45, రహానె 41, దిగ్వేశ్ 1/25). లక్నో: 20 ఓవర్లలో 182/7 (బదోనీ 54, ముకుల్‌‌‌‌ 54*, వైభవ్‌‌‌‌ 2/38).