ఏటూరునాగారం, వెలుగు: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల క్రయ, విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ములుగు కలెక్టర్ దివాకర సూచించారు. శుక్రవారం ఏటూరునాగారంలో పర్యటించిన కలెక్టర్ ముందుగా జీసీసీ గ్యాస్ గోదాంను పరిశీలించారు. వినియోగదారులకు సిలిండర్లు అందిస్తున్న తీరును డీఎం కుంజ వాణిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 8 ఏజెన్సీల పరిధిలో గృహ అవసరాలకు సంబంధించి 86,896, వాణిజ్య అవసరాలకు సంబంధించి 254 గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు తెలిపారు.
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు సుమారు 943 గృహ అవసరాల గ్యాస్ బుకింగ్ లు జరుగుతున్నాయని, అంతే స్థాయిలో సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం సామాజిక ఆస్పత్రిని సడన్ విజిట్ చేశారు. సూపరింటెండెంట్ సురేశ్‌తో కలిసి రోగులు చికిత్స పొందుతున్న వార్డులను పరిశీలించి, రోగులతో మాట్లాడి వైద్యంపై ఆరా తీశారు. రజకవాడలో పర్యటించి, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.
ఐటీడీఏ ఇన్చార్జి పీవోగా..
ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ఐటీడీఏ పీవోగా ములుగు కలెక్టర్ దివాకర శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పీవోగా పనిచేసిన చిత్రామిశ్ర కరీంనగర్ కలెక్టర్‌గా ప్రభుత్వం పదోన్నతి కల్పించగా, అటు కలెక్టర్ గా, ఇటు పీవోగా పనిచేస్తున్న ఆమెకు పాలనా పరమైన ఇబ్బందులు తలెత్తడంతో ములుగు కలెక్టర్ దివాకర తాత్కాలిక పీవోగా బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఐటీడీఏలో నిర్వహించే గిరిజన దర్భార్‌లో గిరిజనుల నుంచి వినతులు స్వీకరిస్తానని కలెక్టర్ తెలిపారు.
