V6 News

ములుగు జిల్లాలో విషాదం.. కోతులను చంపేందుకు బాలామృతంలో విషం.. తెలియక తిని బాలుడి మృతి

ములుగు జిల్లాలో విషాదం.. కోతులను చంపేందుకు బాలామృతంలో విషం.. తెలియక తిని బాలుడి మృతి
  • మరో ఇద్దరు చిన్నారులకు తప్పిన ప్రాణాపాయం 

    వెంకటాపూర్, వెలుగు: ములుగు జిల్లా గోవిందరావుపేటలో విషాదం చోటుచేసుకున్నది. కోతుల కోసం బాలామృతంలో పెట్టిన విషగుళికలు తిని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.  గ్రామంలోని అంగన్‌‌‌‌వాడీ సమీపంలోని నర్సరీలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. దీంతో వాటిని చంపేందుకు ఎవరో బాలామృతం కవర్‌‌‌‌‌‌‌‌లో విషగుళికలు పెట్టి.. నర్సరీ ఉన్న పల్లె ప్రకృతివనంలో ఉంచారు.

 ఆదివారం అంగన్‌‌వాడీకి సెలవు కావడంతో  ఇరుగు మమత, శ్రావణ్​ దంపతుల చిన్న కొడుకు అశ్విన్​ నందన్​ (4).. తన అక్క జాను, మరో బాలుడితో కలిసి ప్రకృతివనంలో ఆడుకునేందుకు వెళ్లాడు. అక్కడ బాలామృతం పాకెట్​ కనిపించడంతో తీసుకుని ముగ్గురూ తిన్నారు. జాను, మరో బాలుడు విషగుళికలు వికారంగా ఉండడంతో ఉమ్మేశారు. 

అస్వస్థతకు గురయినా వారికి ప్రాణాపాయం తప్పింది. కానీ.. అశ్విన్​ నందన్​ మాత్రం విషగుళికలు పూర్తిగా తినడంతో తీవ్ర​ అస్వస్థతకు గురయ్యాడు. కడుపునొప్పితో బాధ పడుతున్న బాలుడిని గమనించిన తల్లిదండ్రులు 108 అంబులెన్స్‌‌లో ములుగు సర్కారు దవాఖానాకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. 

చికిత్స పొందుతూ అశ్వినీ నందన్​ సోమవారం ఉదయం మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. నర్సరీలోని చెట్లను కోతుల నుంచి రక్షించేందుకు బాలామృతం కవర్‌‌‌‌లో విషగుళికలను పెట్టారని భావిస్తున్న పోలీసులు.. వాటిని అక్కడ ఎవరు పెట్టారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.